కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీకి అనుమతి

– ఇదే సీఎం కేసీఆర్‌ సంకల్పానికి నిదర్శనం :మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వంద ఎంబీబీఎస్‌ సీట్లతో కరీంనగర్‌ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీకి అనుమతి లభించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఈ ఏడాదిలో అనుమతి పొందిన తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు అభినందనలు తెలిపారు. వీటితో అదనంగా 900 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. వైద్యవిద్యలో మరో మైలురాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదేండ్లలో తెలంగాణలో ప్రభు త్వ మెడికల్‌ కాలేజీల సంఖ్య ఐదు నుంచి 26కు చేరు కున్నాయని తెలిపారు. వైద్యవిద్యతో పాటు ఆరోగ్యస ంరక్షణ సేవలకు ఇవి ఊతమిచ్చాయని మంత్రి తెలిపారు. కొత్తగా కరీంనగర్‌కు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ రావడం ప్రత్యేక వైద్యసేవలను ప్రజలకు చేరువ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పురోగతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలి
తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) పరిధిలో పురోగతిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం టీఎస్‌ఎంఐడీసీ, ఎన్‌ హెచ్‌ఎం కార్యక్రమాలపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సెంటర్‌తో పాటు గాంధీ, ఎంజీఎం, పేట్లబుర్జు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌, నర్సింగ్‌ కాలేజీలు నిర్మాణాలను లక్ష్యంలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రారంభానికి సిద్దంగా ఉన్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్స్‌ ప్రారంభించాలని ఆదేశించారు.ఈ సంవత్సరం ప్రారంభం కానున్న మెడికల్‌ కాలేజీల పనులు సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 14న ప్రారంభించనున్న కేసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love