ఆర్టీసీ విలీన ప్రకటనను

RTC Merger Announcement– స్వాగతించిన కార్మిక సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని కార్మిక సంఘాలు స్వాగతించాయి. దీనికోసం ప్రభుత్వం నియమించిన కమిటీలో యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరాయి.
సంతోషం…కానీ…
వీఎస్‌ రావు, టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌)
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రకటన, కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నాం. కానీ తక్షణం ఆర్టీసీ కార్మికులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై రాష్ట్ర మంత్రివర్గం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కార్మికులకు రెండు వేతన సవరణలు చెల్లించాల్సి ఉంది. క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌), పెన్షన్‌, ఎస్‌ఆర్‌బీటీ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణీత గడువులోగా నివేదిక ఇవ్వాలి.
మంచి నిర్ణయం
కే రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం నుంచే మా యూనియన్‌ ఈ డిమాండ్‌ను వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనం తర్వాత, ఇక్కడ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని చాలా పోరాటాలు చేశాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడం సంతోషం.
మేమే చివరి ఉద్యోగులం కాకూడదు
పీ కమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఎమ్‌యూ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రకటనను స్వాగతిస్తున్నాం. కానీ సంస్థకు మేమే చివరి ఉద్యోగులం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలి. అదే సమయంలో కార్మికులకూ న్యాయం చేయాలి. పెన్షన్‌ సహా అనేకం అంశాలపై స్పష్టత రావల్సి ఉంది.
కార్మికుల చిరకాల కోరిక
థామస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీఎమ్‌యూ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల చిరకాల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం పక్షాన అండగా నిలిచారు. కొంత జాప్యం జరిగినా సీఎం కేసీఆర్‌ కార్మికులకు మేలు చేశారు.
ఇంకా స్పష్టత రావాలి
వీ తిరుపతి, అధ్యక్షులు, టీఎమ్‌యూ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించడం సంతోషం. దీనికి సంబ ంధించిన విధివిధానాలు వచ్చాకే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు పదేండ్లుగా కొట్లాడుతూనే ఉన్నారు. ఈ నిర్ణయం ఇప్పటికే తీసుకొని ఉంటే, అనేక ప్రాణాలు పోకుండా నిలువరించినట్టు అయ్యుండేది.
థాంక్స్‌…
కే హన్మంతు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎమ్‌యూ)
ఈ డిమాండ్‌ సాధన కోసమే మేం యూనియన్‌ స్థాపించాం. ఇన్నేండ్లకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దాన్ని స్వాగతిస్తున్నాం. విధివిధానాల ఖరారులో కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కార్మిక సంఘాలకు స్థానం కల్పించండి
కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి, సీపీఐ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం నియమిస్తున్న కమిటీలో కార్మిక సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. తక్షణం ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి.

Spread the love