తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుజూస్తున్న మిల్లుల బాగోతం

– స్వయంగా రంగంలోకి దిగిన సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ చైర్మెన్‌ రవీందర్‌సింగ్‌
– రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి సోదాలు
– ప్రభుత్వమిచ్చే ధాన్యం, సీఎంఆర్‌ అమ్ముకుంటున్న మిల్లుల సీజ్‌
– తెల్లసంచుల్లో ధాన్యం, పీడీఎస్‌ బియ్యం నిల్వలు
– సీఎంఆర్‌ ఇవ్వని 81 మిల్లులకు నోటీసులు
– ‘సీఎంఆర్‌తో మిల్లర్ల వ్యాపారం’ శీర్షికన గత నెలలో ‘నవతెలంగాణ’ ప్రచురణ
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌ జిల్లాలో తవ్వినకొద్దీ మిల్లర్ల అక్రమాలు వెలుగుజూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ధాన్యం అమ్ము కుంటూ, ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ను పక్కదారిపట్టిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్వయంగా సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ చైర్మెన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రంగంలోకి దిగారు. రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి నాలుగు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బ్యాంక్‌ గ్యారెంటీ లేకుండా ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్‌ కోసం ఇస్తుండగా.. ‘సొమ్ము ఒకరిది.. సోకొకరిది’ అన్న చందంగా పలువురు మిల్లర్లు అక్రమాలకు తెరతీశారు. ఇదే విషయమై గత నెల 20న ‘సీఎంఆర్‌తో మిల్లర్ల వ్యాపారం’ శీర్షికన ‘నవతెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. అందులో చెప్పి నట్టుగానే మిల్లర్ల బాగోతాలు ఇప్పుడు వెలుగుజూస్తున్నా యి. ఈ క్రమంలో సీఎంఆర్‌ ఇవ్వని 81 రైస్‌ మిల్లర్లకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ నోటీసులు జారీ చేశారు. వారంలోగా సీఎంఆర్‌ ఇవ్వడంలో ఎలాంటి ప్రగతి కనిపించని మిల్లులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో మిల్లింగ్‌ సామర్థ్యానికి మించి వచ్చే లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొందరు మిల్లర్ల అక్రమ వ్యాపారానికి అవకాశంగా మారింది. ప్రతి సీజన్‌లోనూ గడువులోపు ఎఫ్‌సీఐకి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వకుండా ప్రభుత్వ ధాన్యంతోనే వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సర్కారు బియ్యాన్నే బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అందులోనూ బియ్యాన్ని నూకలుగా మార్చి మరీ అధికారులను ఏమార్చుతూ దర్జాగా లారీల్లో తరలిస్తున్నారు. గడువులోపు సీఎంఆర్‌ ఇవ్వకుండా జాప్యం చేసే మిల్లులకు అధికారులు నోటీసులు ఇస్తూ కొన్నింటిని బ్లాక్‌లిస్టులో పెడుతున్నారు. అయినప్పటికీ ఏటా రెండు సీజన్లలో భారీగా వచ్చే ధాన్యం దిగుబడులకు.. మిల్లింగ్‌ చేసే సామర్థ్యం సరిపోవడం లేదు. దాంతో మళ్లీ అవే మిల్లులకు మినహాయింపులు ఇస్తూ ధాన్యం కేటాయిస్తు న్నారు. మిల్లుల్లో లెక్కకు రాని బియ్యంపై తేల్చాల్సిన అధికా రులకు ప్రతి ఆర్నెళ్లకోమారు వచ్చే ధాన్యం దిగుబడులు, అవి మిల్లులకు కేటాయించడం, తిరిగి సీఎంఆర్‌ సేకరించడం వంటి పనుల మధ్య ఒత్తిడికి గురవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని మిల్లులపై చర్యలు తీసుకున్నా.. మళ్లీ మినహాయింపులు ఇవ్వాల్సి వస్తూ తిరిగి ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. 2022-23 వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ 25శాతం కూడా ఎఫ్‌సీఐకి ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం.
రంగంలోకి సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ చైర్మెన్‌
కార్పొరేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌, సివిల్‌ సప్లరు అధికారులతో రవీందర్‌సింగ్‌ కలిసి బృందాలుగా ఏర్పడి.. ఈనెల 11 నుంచి హుజూరాబాద్‌ కేంద్రంగా మిల్లు ల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో సీఎంఆర్‌ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం, నిల్వ ఉన్న బియ్యంతోపాటు రికార్డులనూ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మహాలక్ష్మి ఇండిస్టీస్‌లో సీఎంఆర్‌కు సంబంధించిన 4173 క్వింటాళ్ల ధాన్యం నింపిన 10,437 బ్యాగులు మాయమైనట్టు గుర్తించారు. దీనిపై సదరు మిల్లు యజమానిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. లక్ష్మీ గణపతి రైస్‌మిల్లులోనూ 3,817 బస్తాలు ధాన్యం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. మహాలక్ష్మి ఇండిస్టీస్‌ యజమానే వరుణ్‌ రైస్‌మిల్లునూ నిర్వహిస్తుండగా.. ఆ మిల్లులోనూ ఆరా తీసి సీజ్‌ చేశారు. లక్ష్మీ గణపతి, హనుమాన్‌ రైస్‌ మిల్లుల్లో పీడీఎస్‌ బియ్యం ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు, శాంపిల్స్‌ సేకరించి స్థానిక అధికారులకు అప్పగించారు. ఇలా మరిన్ని మిల్లుల్లో కూడా గన్నీ బ్యాగులకు బదులుగా తెల్ల సంచుల్లో నింపిన ధాన్యాన్ని, పీడీఎస్‌ బియ్యాన్ని, లెక్కల్లో లెక్కకురాని రికార్డులను గుర్తించారు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో పెద్దఎత్తున ధాన్యం దిగుబడులు వస్తున్నం దున ప్రభుత్వమే ఎలాంటి బ్యాంకు గ్యారెంటీ లేకుండా నేరుగా మిల్లులకు అందిస్తోంది. మిల్లులకు అండగా నిలుస్తోంది. సర్కారును మోసం చేస్తూ నష్టం కలిగించే విధంగా సీఎంఆర్‌ ఇవ్వకుండా కొందరు బియ్యంతోపాటు ధాన్యాన్నీ అమ్ముకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా తనిఖీల్లోనూ తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మిల్లుల్లోనూ సోదాలు నిర్వహిస్తాం. ప్రభుత్వానికి నష్టం కలిగించేవారిలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదు.
సర్దార్‌ రవీందర్‌సింగ్‌,
సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ చైర్మెన్‌

Spread the love