పొలిటికల్‌ హీట్‌

– ఎత్తుకు పై ఎత్తులు
– సోషల్‌ మీడియా వేదికగా రూమర్లు
– జనాన్ని గందరగోళపర్చడమే లక్ష్యం
– ఉత్తమ్‌ కారెక్కుతున్నారని ప్రచారం
– కేంద్రమంత్రులతో కేటీఆర్‌ భేటీపై అనుమానాలు
– ఢిల్లీకి రమ్మంటూ ఈటల, రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం పిలుపు
– కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకేతో కోమటిరెడ్డి సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అధికారం కావాలి. దానికోసం జనాన్ని తమవైపుకు తిప్పుకోవాలి. ప్రత్యర్ధులపై అవిశ్వాస ప్రచారం చేయాలి. దానికి సోషల్‌ మీడియాను వేదిక చేసుకోవాలి. సంచలనం కల్గించే కామెంట్స్‌ చేయాలి. దానికి ప్రత్యర్ధులూ అంతే ఘాటుగా స్పందించాలి. అంతిమంగా ఓటర్లను గందరగోళపర్చాలి. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఇలాగే ఉంది. వీటన్నింటికీ దూరంగా జనం గోసను నెత్తికెత్తుకొని, పేదలకు ఇండ్లు, ఇంటి జాగాలు ఇవ్వాలంటూ కమ్యూనిస్టులు భూపోరాటాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను షురూ చేసింది. తాజాగా ఓ బృందం ఢిల్లీ నుంచి వచ్చి శాంతిభద్రతలు సహా ఏర్పాట్లపై ఎస్పీలు, కలెక్టర్లతో భేటీ అయ్యింది. ఇంతే వేగంగా రాజకీయపార్టీలు కూడా ఎత్తుగడలు వేస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ శుక్రవారం ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. చివరకు ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి…అలాంటిదేం లేదంటూ ప్రకటన చేశారు. అయినా వైరల్‌ ఆగకపోవడంతో ‘లీగల్‌’గా చర్చలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. ఈ పోస్ట్‌ ఎవరి సృష్టి? పొగలేకుండా నిప్పు రాజుకుంటుందా? అనే చర్చ రాష్ట్ర రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, ఆపార్టీ చేరికల కమిటీ చైర్మెన్‌ ఈటల రాజేందర్‌ మధ్య ‘అధికార మార్పిడి’ సైలంట్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది. మునుగోడులో ఓటమి తర్వాత అక్కడ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైలెంట్‌ అయ్యారు. ఈటల, కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోకి జంప్‌ అంటూ ప్రచారం జరుగుతున్నది. దీంతో వాళ్లిద్దర్నీ ఢిల్లీ రమ్మని బీజేపీ అధిష్టానం వర్తమానం పంపింది. దేశానికి మేమే ప్రత్యామ్నాయం అంటున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్రమంత్రులతో భేటీ అయ్యారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ‘ఉప్పు-నిప్పు’ పై నీళ్లు చల్లి, ఇద్దరూ దోస్తులవుతున్నారంటూ మరో ప్రచారం మొదలైంది. ఇక ఐటీ, ఈడీ, సీబీఐలను నమ్ముకున్న బీజేపీ ‘మునుగోడు’తో డీలాపడి, కర్నాటక ఫలితాలతో ‘బేర్‌’ మంటూ రాష్ట్రంలో తమ స్థానం ఎక్కడోనని వెతుకులాట మొదలెట్టింది. ఏ నేత ఎప్పుడు ఎటు జంప్‌ అవుతాడో అర్థంకాని స్థితిలో ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్‌ కోసం పావులు కదుపుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం తర్వాత రాష్ట్రంలో రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ కూడా గమనించింది. అందుకే ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ సహా మంత్రులంగా తమ వాగ్భాణాల్ని కాంగ్రెస్‌పైకి ఎక్కుపెడు తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ కోవర్టులు బీజేపీ, కాంగ్రెస్‌లో ఉన్నారనీ, ఆయారాం, గయారాంల సమాచారంపై ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నదనే ప్రచారమూ జరుగుతున్నది. అదే సమయంలో పోలీస్‌ ఇంటలిజెన్స్‌ వ్యవస్థ కూడా రాజకీయ పరిణామాలు, నేతల కదలికలపై సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీ వెళ్తారా?
బీజేపీతో కొంత కాలంగా అంటీముట్టునట్టున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపువచ్చినా, వారు వెళ్తారా…లేదా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. దానికితోడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భేటీ రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రగిల్చింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. రాజగోపాల్‌రెడ్డికి మార్గాన్ని సుగమం చేయడం కోసమేనంటూ ప్రచారం జరుగుతున్నది. ఈటల, రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రాగానే శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో బండి సంజరు సమావేశమవడం పలు ఊహాగానాలకు తావిస్తున్నది.
బీఆర్‌ఎస్‌ రివర్స్‌ ఆపరేషన్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో అప్రమత్తమైన బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కూడా రివర్స్‌గేర్‌లో పని మొదలుపెట్టారు. రేవంత్‌రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌లోని కీలక నేతలను బీఆర్‌ఎస్‌లోకి లాక్కోవడంపై దృష్టిపెట్టారు. అందులో భాగంగానే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌పై ఫోకస్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతు న్నది. ఆ క్రమంలోనే ఉత్తమ్‌తో సీక్రెట్‌గా ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర సమాశమైనట్టు తెలిసింది. ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు స్తబ్దుగా మారడా నికి బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యలో కుదిరిన ఒప్పదమేనంటూ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే శుక్రవారం బహిరంగంగా విమర్శించారు. అమిత్‌షాతో కేటీఆర్‌ భేటీ కూడా అందులో భాగమేనంటూ కొనసాగింపును ఇచ్చారు. ఆయన ప్రశ్నలోనూ అర్థముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పోరుబాటలో కమ్యూనిస్టులు
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ప్రతి దానికీ రాజకీయ రంగు పులుముతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఎప్పటిలాగే ప్రజాసమస్యలపై తమ గళాన్ని విప్పుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కొట్లాడుతున్నాయి. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) పోరుబాట పట్టి ప్రజల్ని కదిలిస్తున్నది. రాజకీయ కొట్లాటను పక్కనబెట్టి ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని పాలకులకు హితవు పలుకుతున్నది.

Spread the love