కేటాయింపులే కాదు.. ఖర్చు కూడా చేయాలి

– బడ్జెట్‌పై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర బడ్జెట్‌లో ఆయా రంగాలకు నిధుల కేటాయింపులే కాకుండా వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ అభిప్రాయప డింది. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నదని విశ్లేషించింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారంనాడిక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించినట్టు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ”2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,296 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వడ్డీ మాఫీ క్రింద రు.22,407 కోట్లు, అప్పు చెల్లింపుల క్రింద రూ.28,480 కోట్లు (మొత్తం బడ్జెట్‌లో 18 శాతం) చెల్లింపులు ఉన్నాయి. గహ నిర్మాణానికి కేటాయించినట్టు ప్రకటించిన రూ.12వేల కోట్లు బడ్జెట్‌లో చూపలేదు. కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన రుణాల ద్వారా నిర్మాణాలు చేస్తామని బడ్జెట్‌ తర్వాత ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. బడ్జెట్‌లో చూపిన అప్పులు 2024 మార్చి నాటికి రూ.3,57,059 కోట్లుగా (రాష్ట్ర స్థూల ఆదాయంలో 23.8 శాతం) చూపారు. వాస్తవానికి కార్పొరేట్‌ అప్పులతో సహా లెక్కిస్తే రాష్ట్ర అప్పులు రు.4.5 లక్షల కోట్లకు చేరుకుంటాయి. వద్దిరేటు 7.8 శాతంగా ప్రకటించారు. గత ఏడేండ్ల సగటు వద్ధిరేటు 12.6 శాతంగా ఉంది. తలసరి ఆదాయం జాతీయ ఆదాయం కన్నా 86 శాతం ఎక్కువ ఉన్నట్లు 2022-23లో రూ.3,17,115 ఉన్నట్టు ప్రకటించారు. ఓ వైపు తలసరి ఆదాయం పెరుగుతుంటే, మరోవైపు రాష్ట్రంలో దరిద్రుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 37 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి” అని పేర్కొన్నారు.
”అక్షరాస్యత అత్యంత కీలకం. విద్యారంగానికి రూ.19 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. కేరళ, బెంగాల్‌, త్రిపురలో వామపక్ష ప్రభుత్వాలు పరిపాలన ప్రారంభించిన ఐదేండ్లలోనే 90శాతం అక్షరాస్యతను సాధించాయి. ఆరోగ్య రంగానికి రూ.11,525 కోట్లు చూపినప్పటికీ అనేక మంది నేటికీ వైద్య సేవలకు దూరంగానే ఉన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు కరోనా అనంతరం నేటికీ ఆరోగ్య వసతికి నోచుకోలేదు. ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా దవాఖానాలు ఏర్పాటు కాలేదు. హౌంశాఖకు రూ.9,598 కోట్లు కేటాయించినా శాంతిభద్రతల సమస్య మెరుగుపడలేదు. మహిళల కిడ్నాపులు, అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతున్నట్టు పోలీస్‌శాఖ నివేదికలు చెప్తున్నాయి. కుల దురహంకార హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు కేటాయించారు. దీనిలో 75శాతం రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా కోసమే నిధులు ఖర్చు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.26,885 కోట్లు కేటాయించినా, కాలయాపన వల్ల వాటి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి” అని తెలిపారు. ”ఎనిమిదేండ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు సరిగా ఖర్చుచేయకుండా ప్రక్కదారి పడుతున్నాయి. దళితులకు మూడెకరాల భూమి ఊసే లేదు. నిరుద్యోగభృతి, గిరిజనబంధుకు కేటాయింపులు లేవు. బడ్జెట్‌లో ఏటా 20 శాతం నిధులు రావట్లేదు. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీల కేటాయింపులు తగ్గిస్తున్నారు. ఇలాంటి తగ్గింపులు లేకుండా దారిద్య్రరేఖ నుంచి ఎగువకు తీసుకురావడానికి, విద్యా-వైద్యానికి అదనపు నిధులు కేటాయించాలనీ, వాటిని పూర్తిగా అభివద్ధికోసం ఖర్చుచేయాలి” అని డిమాండ్‌ చేశారు.

Spread the love