బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించడమే సీపీఐ(ఎం) లక్ష్యం

CPI(M)'s aim is to defeat the BJP and its allies– బీజేపీ పంచన చేరడానికి కేసీఆర్‌ ప్రయత్నాలు
– ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
– పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండానే : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-పాలకుర్తి
దేశాన్ని, ప్రజలను మోసం చేస్తున్న మతోన్మాద బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీలను ఓడించడమే సీపీఐ(ఎం) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి సీపీఐ(ఎం) కార్యకర్తలు ఎర్రజెండాలు చేత పట్టి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘటన ఐలమ్మ పోరాటమని తెలిపారు. సెప్టెంబర్‌ 17న నైజాం సర్కార్‌ కూలిపోయిన దినం సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్స వాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. అందుకే 17వ తేదీని బీజేపీ విమోచన దినంగా పరిగణి స్తారని, ఈ సందర్భంగా ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే అమిత్‌ షా పర్యటనను వ్యతిరేకిస్తు న్నామని తెలిపారు. బీజేపీని ఓడించేందుకు దేశంలో ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బీజేపీతో సీఎం కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, కమ్యూనిస్టులతో మైత్రి కొనసాగిస్తామని చెబుతూనే మాట మార్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించగలిగే వాళ్లతో సీపీఐ(ఎం) స్నేహం కొనసాగుతుందని, పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలు భూ పోరాటాలు చేసి భూములను సాధించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటున్నదని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత ఎర్రజెండాదేనని స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పాలకుర్తి కేంద్ర బిందువు అని, విసునూర్‌ దేశ్‌ముఖ్‌ గుండాల నుంచి ఐలమ్మ పంటను ఎర్రజెండా కాపాడిందన్నారు. పేదలకు భూములు కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేస్తే, నేటి అధికార పార్టీ పాలకులు వందల ఎకరాల భూములను కాజేస్తున్నారని విమర్శించారు. మంచుప్పుల భూ పోరాట సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నేటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు. తప్పు చేసిన వారిని క్షమించరాదని, కానీ, ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు జారీ చేయకుండా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో భూ పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సింగారపు రమేష్‌, చందు నాయక్‌, జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల నాయకులు బెల్లీ సంపత్‌, మాసంపెళ్లి నాగయ్య, అశోక్‌ బాబు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love