మోడీ కుర్చీ కదులుతున్నది

– అందుకే ఆయన ‘మిత్రుల’ పేర్లు తీస్తున్నారు
– అదానీ, అంబానీల మీద ప్రధాని ఆరోపణలపై కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటమిని పసిగట్టి పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలను ఉద్దేశించి ప్రధాని మోడీ ‘తన స్నేహితులపై’ దాడి చేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. తెలంగాణలో జరిగిన ర్యాలీలో.. అంబానీ, అదానీలను కాంగ్రెస్‌ రాత్రికి రాత్రే విమర్శించటం మానేసిందనీ, దానికి ప్రతిఫలంగా పార్టీకి వారి నుంచి ”నల్లధనం” వచ్చిందా? అని ప్రధాని ప్రశ్నించారు. దీనికి కౌంటర్‌గానే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. మోడీ వ్యాఖ్య ఎన్నికల ఫలితాలకు నిజమైన సూచిక అని పేర్కొన్నారు. మోదీజీ కుర్చీ వణుకుతున్నట్టు ఇది చూపిస్తున్నదని ఖర్గే ఎక్స్‌లో వివరించారు. ప్రధాని సాధారణంగా ఇద్దరు వ్యాపారవేత్తల గురించి రహస్యంగా మాట్లాడతారనీ, బుధవారం నాటి ర్యాలీలో వారి పేర్లను అతను బహిరంగంగా పెట్టటం ఇదే మొదటిసారని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. వారు (అంబానీ, అదానీ) డబ్బులిస్తారన్న వాదన మీకు వ్యక్తిగత అనుభవమా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలను పంపి వారిని వీలైనంత త్వరగా విచారించాలనీ, ఇందులో భయపడొద్దని చెప్పారు. అదానీ, అంబానీలకు మోడీ ఇచ్చిన డబ్బును భారత్‌లోని పేదలకు తాము ఇస్తామని స్పష్టం చ ఏశారు. కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేష్‌ మాట్లాడుతూ.. మోడీ తన ఎన్నికల ఓటమిని చూసి కంగారుపడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు పారిశ్రామికవేత్తల వద్ద నల్లధనం మూటలు ఉంటే అదానీ, అంబానీలకు చెందిన గుత్తేదారులపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మోడీ ఆరోపణలపై విమర్శలు గుప్పించారు. నల్లధనాన్ని అరికట్టటంలో నోట్ల రద్దు విఫలమైందనటానికి ప్రధాని వ్యాఖ్యలే నిదర్శనమని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల(ఈబీ) ద్వారా బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారిలో అదానీ కంపెనీల ప్రస్తావన లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీ సాకేత్‌ గోఖలే ఆరోపించారు.

Spread the love