20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?

– రైతులను కాల్చి చంపిన వాళ్లు ఓట్లు ఎలా అడుగుతున్నారు?
– ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలి
– మోడీ మళ్లీ గెలిస్తే ఎన్నికలనేవే ఉండవు
– భువనగిరిలో సీపీఐ(ఎం)ను గెలిపించాలి : పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– జనగామలో అభ్యర్థి జహంగీర్‌తో కలిసి రోడ్‌ షో
నవతెలంగాణ జనగామ
మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా పట్టణంలో భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌తో కలిసి.. తమ్మినేని రోడ్డు షో నిర్వహించారు. అంబేద్కర్‌ నగర్‌లోని గురుద్వార్‌ వద్ద ప్రారంభమైన రోడ్డు షో.. ఇండిస్టియల్‌ ఏరియా, మైనార్టీ కాలనీ, సంజరు నగర్‌, అమాలిగడ్డ చమన్‌ (పెద్దనల్ల), ధర్మకంచ, వెంకన్నకుంట, జూబ్లీగార్డెన్‌, బస్టాండ్‌ మెయిన్‌ రోడ్‌, బాలాజీ నగర్‌, సత్రంవీధి, కురుమవాడ, శివకృష్ణ టాకీస్‌ ఏరియా, నెహ్రూపార్క్‌, స్టేషన్‌ రోడ్‌ మీదుగా మధ్యాహ్నం 1గంటకు సీపీఐ(ఎం) కార్యాలయానికి చేరుకుంది. అనంతరం సాయంత్రం 4గంటలకు తిరిగి ప్రచారాన్ని ఏసీరెడ్డి నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీ నుంచి ప్రారంభించి.. తహసీల్దార్‌ కార్యాలయం, పాత ఆంధ్రాబ్యాంకు, లేబర్‌ అడ్డా, గిర్నిగడ్డ, పాత గోదాములు, లక్ష్మిబాయి కుంట వరకు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌, తమ్మినేని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వారికి ప్రజలు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన లక్ష్మిబాయి కుంటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో తమ్మినేని మాట్లాడారు.
మూడోసారి మోడీ గెలిస్తే దేశంలో ఎన్నికలనేవే ఉండవని అన్నారు. బీజేపీ.. భారత రాజ్యాంగానికి ప్రమాదకరమని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. పదేండ్ల బీజేపీ పాలనలో ప్రజలపై అధిక భారాలు మోపుతూ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదని తెలిపారు. ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో బీజేపీ అవినీతికి పాల్పడిందని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుపరం చేసి, దేశంలో మోడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2017లో మోడీ.. పార్లమెంట్‌ సాక్షిగా రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. పైగా నల్ల చట్టాలను అమలు చేస్తూ రైతులను కాల్చిచంపిన వాళ్ళు ఓట్లను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా, ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న వారిని తొలగించారని అన్నారు. పదేండ్ల బీజేపీ పాలన శంపిలేనంటూ మూడోసారి గెలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వేషన్లను సమీక్షిస్తామన్న బీజేపీ ప్రభుత్వం.. తిరిగి అధికారంలోకి వస్తే వాటిని రద్దుచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన మోడీ.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని విమర్శించారు. బీజేపీ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న గొంతుకలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులపై రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఈసీ, ఐటీ లాంటి వాటితో దాడులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. అందుకే దేశంలో మోడీ పాలనకు చరమగీతం పాడేందుకు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌. రమ, బుర్రి ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, ఇర్రి అహల్య, సింగారపు రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, జోగు ప్రకాష్‌, సుంచు విజేందర్‌, ఎండీ షబానా, పార్టీ సీనియర్‌ నాయకులు బోట్ల శ్రీనివాస్‌, పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Spread the love