రిజర్వేషన్ల రద్దుకు మోడీ- షా కుట్రలు

– బీజేపీని నమ్మితే..మోసపోయినట్టే రాష్ట్రంలో కారు షెడ్‌కు పోయింది..తిరిగిరాదు
– కేసీఆర్‌కు అధికారంలో ఉన్న పదేండ్లలో ప్రజలు గుర్తుకురాలేదు
– పదవి పోయాక తిరిగితే నమ్ముతారా?
– కాంగ్రెస్‌కు పదవులు ముఖ్యం కాదు.. ప్రజా సంక్షేమమే ధ్యేయం
– చేవెళ్లలో రంజిత్‌రెడ్డిని లక్ష ఓట్లతో గెలిపించాలి : చేవెళ్ల పార్లమెంట్‌ రాజేంద్రనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బ్రిటీష్‌ వారసులు మోడీ, షా.. కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బ్రిటీష్‌ జనతా పార్టీగా మారిందని, బ్రిటీష్‌ పాలనలో ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా పాలించారని గుర్తు చేశారు. అదే విధంగా బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన ఎజెండా రిజర్వేషన్ల రద్దని, దాన్ని అమలు చేయడానికి సూరత్‌ నుంచి మోడీ, షా బయలుదేరారని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన రోడ్డు షోలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకొస్తే.. బీజేపీ ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోంద న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, ఆదివాసీల సంక్షేమం కోసం నాటి మేధావులు రాజ్యాంగాన్ని రచించారని, అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తే దేశ ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తదని హెచ్చరించారు. నమో బీజేపీ అంటూ బయలుదేరిన బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మోసం పోవడం తప్పదన్నారు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పి పైసా కూడా వేయలేదని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పదేండ్లలో 7 లక్షల ఉద్యోగాలు కూడా దాటలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని.. రైతుల నడ్డి విరిచేలా నల్లచట్టాలు తీసుకు వచ్చేందుకు కుట్రలు చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం చేవెళ్ల పార్లమెంట్‌కు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్‌ వికారాబాద్‌ను శాటిలైట్‌ సిటీగా గుర్తించి రూ. 2 కోట్ల నిధులు కేటాయిస్తే బీజేపీ రద్దు చేసిందని తెలిపారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసిందన్నారు. ఇలాంటి పార్టీకి ఇక్కడ ఓట్లడిగే నైతిక హక్కులేదని అన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొండ విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉందని, బీజేపీతో జతకట్టి కుటుంబ చరిత్రను కలుషితం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కారు పార్టీ షెడ్‌కు వెళ్లిందని, తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌ మాత్రం కారు.. మళ్లీ రోడ్డెక్కుతుందని కలలుకంటున్నారన్నారు. పదేండ్ల కాలంలో కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు రాలేదని, పదవి పోయిన తర్వాత తిరిగితే నమ్ముతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చేందుకు చేతకాని కేసీఆర్‌.. గంటల కొద్ది టీవీ చానల్‌ వద్ద కూర్చొని మాట్లాడితే ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు.

Spread the love