బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల్లో రెచ్చిపోతున్న ఆకతాయిలు

నవతెలంగాణ హైదరాబాద్: బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. ఆయా దుకాణాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కావాలనే కొందరు రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేస్తున్నారంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ తతంగంపై పోలీసులు ఒకేసారి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు.
గత నెల 20న రాత్రి 7 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని బ్రూక్స్‌ బ్రదర్‌ స్టోర్‌ అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. ఆ తర్వాత గంట వ్యవధిలో స్థానిక వాన్‌ హుస్సేన్‌ స్టోర్‌ అద్దాలు, ఆ పక్కనే ఉన్న వైట్‌ క్రో స్టోర్‌ అద్దాలు, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ 24 సెవన్‌ గ్రాసరీ స్టోర్‌కు సంబంధించిన అద్దాలు పగిలిపోయి గాజు ముక్కలు దుకాణాల్లో చిందరవందరగా పడిపోయాయి. దీంతో కొనుగోలుదారులు భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తికి స్వల్పంగా గాయమైంది. మరుసటి రోజు రాత్రి రోడ్‌నంబరు 2లోని ఆర్‌కే సినీప్లెక్స్‌(పీవీఆర్‌ మాల్‌)లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా ఈ మాల్‌లో రెండుసార్లు ఇదే ఘటన చోటుచేసుకుంది.
ఈనెల 4న రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని సూర్య సిల్క్‌ టెక్స్‌ క్రియేషన్‌ స్టోర్‌ అద్దాలు, 5న రాత్రి స్థానిక అండర్‌ ఆర్మర్‌ స్టోర్‌లోని భారీ అద్దాలపైకి రాళ్లు దూసుకురావడంతో ముక్కలయ్యాయి. ఇలా పదికిపైగా సంఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలపై ఆయా స్టోర్ల మేనేజర్లు ఈనెల 16న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు క్యాబ్‌ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Spread the love