– ఇంటర్ ఫలితాల్లో వారిదే పైచేయి
– ఫస్టియర్‌లో 60.01 శాతం, సెకండియర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణత
– మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
– 2 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
– నేటినుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ : విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
– ప్రథమ సంవత్సరంలో రంగారెడ్డి, ద్వితీయ సంవత్సరంలో ములుగు అగ్రస్థానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను బుధవారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,78,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,87,261 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,41,682 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,190 (68.35 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,37,041 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,22,071 (51.50 శాతం) మంది పాసయ్యారు. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 4,30,413 మంది పరీక్షలు రాస్తే, 2,62,829 (61.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,17,716 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 (68.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,12,697 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,13,498 (53.36 శాతం) మంది పాసయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 48,310 మంది పరీక్ష రాస్తే, 24,432 (50.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 23,966 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 15,859 (66.17 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 24,344 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 8,573 (35.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.43 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 4,01,445 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,78,856 (69.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,05,381 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 1,55,500 (75.71 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ జనరల్ విభాగంలో 42,723 మంది పరీక్షలు రాస్తే, 27,287 (63.86 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో 21,853 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 17,327 (79.28 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 20,870 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 9,960 (47.72 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) జయప్రదబాయి, జాయింట్ సెక్రెటరీ వై శ్రీనివాస్, సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభం
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. గురువారం నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫీజు చెల్లింపునకు తుది గడువు వచ్చేనెల రెండో తేదీ వరకు ఉన్నది. గురువారం నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు తుది గడువు వచ్చేనెల రెండో తేదీ వరకు ఉన్నది. రీకౌంటింగ్ కోసం ప్రతి పేపర్‌కూ రూ.100, రీవెరిఫికేషన్ కోసం ప్రతి పేపర్‌కూ రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ష్ట్ర్‌్‌జూ://్‌రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. మార్కుల మెమోలను బుధవారం సాయంత్రం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. షార్ట్ మెమోలను కాలేజీ లాగిన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్ నుంచి కలర్ ప్రింట్‌ఔట్ తీసుకోవాలని కోరారు.
ఫస్టియర్‌లో రంగారెడ్డి, సెకండియర్‌లో ములుగు అగ్రస్థానం
ఇంటర్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో రంగారెడ్డి, ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో రంగారెడ్డి నుంచి 71,297 మంది పరీక్షలు రాయగా, 51,121 (71.7 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 37,576 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 25,242 (67.18 శాతం) మంది పాసయ్యారు. 33,721 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 25,879 (76.74 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 71.58 శాతం ఉత్తీర్ణత సాధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 64,828 మంది పరీక్షలు రాయగా, 46,407 (71.58 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 70.01 శాతంతో ములుగు జిల్లా మూడో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 1,717 మంది పరీక్షలు రాస్తే, 1,202 (70.01 శాతం) మంది పాసయ్యారు. 34.81 శాతం ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 7,658 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,666 (34.81 శాతం) ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 72.96 శాతం ఉత్తీర్ణతతో నారాయణపేట జిల్లా అగ్రస్థానంలో, 39.9 శాతం ఉత్తీర్ణత సాధించి సూర్యాపేట జిల్లా చివరిస్థానంలో నిలిచాయి.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 82.95 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 1,695 మంది పరీక్షలు రాస్తే, 1,406 (82.95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 928 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 729 (78.56 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 767 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 677 (88.27 శాతం) మంది పాసయ్యారు. 79.31 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెండో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 58,933 మంది పరీక్షలకు హాజరైతే, 46,742 (79.31 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 77.63 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 64,759 మంది పరీక్షలు రాస్తే, 50,273 (77.63 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 44.29 శాతం ఉత్తీర్ణత సాధించి కామారెడ్డి జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 7,234 మంది పరీక్షలు రాస్తే, 3,204 (44.29 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 80.44 శాతం ఉత్తీర్ణతతో నారాయణపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. 52.48 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది.