రాజీనామా జేబులో పెట్టుకో..

Resignation in pocket Put it..– హరీశ్‌ సవాల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం
– కేసీఆర్‌ మాదిరి మాట తప్పొద్దని సూచన
– ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం..
– మతం పేరిట రెచ్చగొట్టేటోళ్లకు గుణపాఠం చెప్పాలి
– ‘కడియం’ నిజాయితీని చూసి పార్టీలో చేర్చుకున్నం.. : సికింద్రాబాద్‌లో దానం నామినేషన్‌, హన్మకొండ కాంగ్రెస్‌ జనజాతర సభల్లో సీఎం
– కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా.. కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/ సిటీబ్యూరో/బేగంపేట్‌
”మామ, అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు.. రామప్పలోని శివుడి సాక్షిగా, వరంగల్‌ వేయిస్తంభాల గుడి సాక్షిగా, మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. రాజీనామా చేయడానికి పత్రాన్ని జేబులో పెట్టుకోవాలి.. కేసీఆర్‌ మాదిరిగా మాట తప్పొద్దు..” అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆనాడు పెట్రోల్‌ పోసుకున్న తనకు అగ్గిపెట్టె దొరకలేదని చెప్పినట్టు కాదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. బీజేపీ నేతలకు మతపిచ్చి పట్టిందన్నారు. దేవుడు గుడిలో వుండాలె, భక్తి గుండెల్లో వుండాలె.. మతం పేరిట రెచ్చగొట్టేటోళ్లకు గుణపాఠం చెప్పాలన్నారు. బుధవారం సికింద్రాబాద్‌, హన్మకొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌,జనజాతర సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిసాతనన్నారు.. నేను పార్లమెంటులో ప్రశ్నిస్తే 7 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పిండ్రు. విదేశాల్లో నల్లధనముంది, దాన్ని తెచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్నడు.. వరంగలోళ్లకు ఎవరి ఖాతాలోనన్న రూ.15 లక్షలు పడ్డయా ?” అని వరంగల్‌ సభలో సీఎం ప్రశ్నించారు. లేదు.. లేదంటూ సభికులు సమాధానమిచ్చారు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను అదానీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ సరిహద్దుల్లో రైతులంతా పెద్దఎత్తున ఉద్యమిస్తే జాతికి మోడీ క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఖమ్మానికి బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ మంజూరు చేస్తే మోడీ వచ్చాక అమలు చేయలేదన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మహారాష్ట్ర లాతూరుకు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లలో ఏమీ చేయలేని బీజేపీ నేతలు ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఓటర్లకు సూచించారు.
కాళేశ్వరంపై చర్చకు రా..
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైతే చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ మందేసి గీశాడో.. మందు దిగాక గీశాడోగానీ అది కూలిపోయిందన్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ నిన్న నాలుగు గంటలు టీవీ స్టూడియోలో కూర్చున్నారని, సిగ్గుండాలన్నారు. ”నీవు కట్టిన మేడిగడ్డ మేడిపండైంది, సుందిళ్ల సున్నమైంది.. కాంగ్రెస్‌ కట్టిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు చూడండి ఎలా వున్నాయో” అని అన్నారు.
భూములను మింగే అనకొండ ‘అరూరి’
బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి మొన్న చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌.. వేషం మార్చుకొని బీజేపీ అభ్యర్థిగా వస్తున్నారని.. మళ్లీ ఆయన్ను గెలిపిస్తే అనకొండై మీ భూములను మింగుతారని సీఎం ఎద్దేవా చేశారు. భూములు ఆక్రమించే అరూరి రమేష్‌ కావాలో, పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
‘కడియం’ నిజాయితీని చూసే చేర్చుకున్నం..
కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీని సంప్రదించలేదని, తానే స్వయంగా ఆయన్ను సంప్రదించానని, అలాంటి నిజాయితీపరుడుంటే ఆయన అనుభవాన్ని రంగరించి మంచి పాలన అందించొచ్చని కాంగ్రెస్‌లో చేర్చుకున్నామని సీఎం తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తే వరంగల్‌ ప్రజలు కొండా సురేఖను ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో ఆదివాసీ ఆడబిడ్డ సీతక్కను ఎమ్మెల్యేగా చేశారని, ఇప్పుడు వారిద్దరూ మంత్రులుగా వున్నారన్నారు. అదేవిధంగా మరో ఆడబిడ్డ డాక్టర్‌ కడియం కావ్యను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజల తరపున తన గళాన్ని విప్పి ఏం చేయనుందో ఈ సభలో ఆమే స్వయంగా చెప్పారని అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధానయ్యే అవకాశం వచ్చిందని, ఇక్కడ కావ్యను ఎంపిగా గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని కోరారు.
వరంగల్‌కు వరాల జల్లు
వరంగల్‌ నగరానికి ఇండిస్టియల్‌ కారిడార్‌, చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు, మామునూరు విమానాశ్రయం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. కడియం శ్రీహరి అనుభవంతో ఎస్సారెస్పీ మొదటి, రెండో దశ, దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తామన్నారు. టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను అభివృద్ధి చేసి చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. హన్మకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన జనజాతర సభకు హన్మకొండ డీసీసీ అధ్యక్షులు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహదారుడు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినీరెడ్డి, కెఆర్‌.నాగరాజు, సిట్టింగ్‌ ఎంపి పసునూరి దయాకర్‌, మహ్మద్‌ రియాజ్‌, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.రంగయ్య, హన్మకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, సింగారపు ఇందిర, ఝాన్సీరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే..
2004 సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో దత్తాత్రేయను ఓడించి అంజన్‌ కుమార్‌ను ఎంపీగా గెలిపించారని, అప్పటి చరిత్రను పునరావృతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే రాబోతున్నదన్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా ఏ పార్టీ గెలుస్తదో అదే పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉందని చెప్పారు. ఆనాడు సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరడంతో కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మళ్లీ 20 ఏండ్ల తర్వాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్‌ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. దానం గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహిస్తారని చెప్పారు. సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థులు గెలిచినా, కేంద్ర మంత్రులైనా హైదరాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కి తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని, ఈ విషయంపై చర్చపెడదామని.. ఇందుకు కేటీఆర్‌ సిద్ధమా అన్ని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ, కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టేని, అతని పరువు తీయడానికే సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. పద్మారావు నామినేషన్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ టికెట్‌ను బీజేపీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనన్నారు. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో గెలువాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.

Spread the love