ప్రమాణం చేద్దాం రా..

Let's swear..– ఆగస్టు 15లోపు ఆరు హామీలు అమలైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా..
– హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి
– ఎల్లుండి అసెంబ్లీ వద్ద అమరుల స్థూపం వద్దకొస్తా
– సీఎం రేవంత్‌రెడ్డి కూడా వచ్చి ప్రమాణం చేయాలి
– ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు గడువు
– రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త. మళ్లీ పోటీ చేయను. ఒక వేళ అమలు చేయలేకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా..?’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి వరకు గడువు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని రెడ్‌లాస్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయాలపై ఎల్లుండి అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు వస్తానని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా రావాలని, హామీలపై అక్కడే ప్రమాణం చేద్దామని అన్నారు. డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా రణమాఫీ అమలు కాలేదన్నారు. రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను కూడా తయారు చేసిందిలేదన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకం డబ్బులే ఇంకా అందరికీ ఇవ్వలేదన్నారు. కనీసం కౌలు రైతుల్ని గుర్తించే ప్రక్రియ కూడా జరగట్లేదన్నారు. ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి యాసంగీ సీజన్‌లో రైతుల్ని మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి మాట నీట మూట అయిందన్నారు. రైతుల్ని మోసం చేసిన రేవంత్‌రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బాధ్యతను గుర్తు చేస్తున్న ప్రతిపక్షాలపై దాడి చేయడం రేవంత్‌రెడ్డి తొండి రాజకీయానికి నిదర్శమన్నారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయ చేతకాకపోతే తప్పును ఒప్పుకుని పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీసీ వైస్‌ చైర్మెన్‌ పట్నం మాణిక్యం, కాసర్ల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

Spread the love