ఎమ్మెల్సీ కవిత అరెస్టు

MLC Kavitha arrested– ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అదుపులోకి తీసుకున్న ఈడీ
– ఆరు గంటలకు పైగా ఇంట్లో సోదాలు
– నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత
– ఈడీ అధికారులతో కేటీఆర్‌, హరీశ్‌ వాగ్వాదొం ఢిల్లీకి తరలింపు
దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేశారు.  బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్‌ జరిగింది. అంతకముందు, దాదాపు ఆరు గంటలకు పైగా ఈడీ అధికారులు కవిత నివాసంలో సోదాలు  నిర్వహించారు.
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి/ బంజారాహిల్స్‌
కవితను అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలనే ఈడీ అధికారుల ప్రయత్నాలకు ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుల నుంచి ప్రతిఘటన ఎదురై తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. చివరికి తాము వేసుకున్న వ్యూహం ప్రకారమే ఈడీ అధికారులు కవితను రాత్రి ఢిల్లీకి విమానంలో తీసుకెళ్లారు.
స్కాంలో కవితదే కీలక పాత్ర : ఈడీ ఆరోపణలు
గత కొంత కాలంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితను ఈడీ అరెస్ట్‌ చేయనున్నట్టు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఈస్కామ్‌లో కవిత పీఏ అయిన అశోక్‌ అప్రూవర్‌గా మారి.. కోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలం కవితను అరెస్ట్‌ చేయటానికి ఈడీ అధికారులకు పెద్ద ఆధారంగా నిలిచినట్టు తెలుస్తున్నది. గత ఏడాదిన్నర కాలంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెలుగు చూసి ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో సౌత్‌ ఇండియా గ్రూపు తరఫున కవిత కీలక పాత్ర పోషించి, భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డట్టు ఈడీ నుంచి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, సౌత్‌ ఇండియా గ్రూపునకు చెందిన సిండికేట్‌కు మద్యం దుకాణాలు లభించేలా చేయటంలో కవిత కీలక పాత్ర పోషించారనీ, ఇందులో భారీ ఎత్తును ముడుపులు చేతులు మారాయని ఈడీ ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై 19న విచారణ
మరోవైపు, కవిత సన్నిహితుడిగా పేర్కొనబడే రామచంద్రపిళ్లై సైతం ఈ కేసులో మొదట అప్రూవర్‌గా మారి, కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చి తర్వాత దానిని వెనకకు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే, కవితను గతేడాది మార్చి నెలలోనే మూడు సార్లు కేంద్ర దర్యాప్తు బృందాలు ఈ కేసులో ప్రశ్నించాయి. కాగా, తాజాగా ఈడీ ఇచ్చిన నోటీసులను సుప్రీంకోర్టులో కవిత సవాలు చేయగా.. దానిపై ఈనెల 19న న్యాయస్థానం విచారణను చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో నాటకీయ ఫక్కీలో ఢిల్లీ నుంచి వచ్చిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగెందర్‌ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ఈడీ ప్రత్యేక బృందం.. బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో చేరుకొని సోదాల సెర్చ్‌ వారెంట్‌ను చూపించి మరీ చర్యలకు దిగింది. వీరితో పాటు ఐటీ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు.
ఈడీ సోదాలు.. భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు
మొదట కవితకు చెందిన సెల్‌ఫోన్లతో పాటు లోపల ఉన్నవారి సెల్‌ఫోన్లన్నింటినీ స్వాధీనపర్చుకున్న అధికారులు.. కవిత నివాసంలో అణువణువునా సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. నివాసం ప్రధాన గేట్లను మూసివేసి, బయటవారిని ఎవరినీ లోనికి అనుమతించకుండా కట్టుదిట్టంగా సోదాలు జరిపారు. కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని సోదాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కవిత నివాసంలోకి ప్రవేశించాలని వారు చేసిన ప్రయత్నాలను పోలీసులు నిరోధించారు. మరోవైపు, కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులను.. కవిత తరఫు న్యాయవాదులు సోమభరత్‌, మరికొందరు ఈ సోదాలపై ప్రశ్నించినప్పటికీ.. వారు ఏ మాత్రమూ స్పందించకుండా తమ పనుల్లో నిమగమయ్యారు.
కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్‌, హరీశ్‌.. అధికారులతో వాగ్వాదం
ఇంకోవైపు, హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చెందిన మరో ఆరుగురు అధికారులు కూడా కవిత నివాసానికి చేరుకొని ఢిల్లీ అధికారులకు మద్దతుగా నిలిచారు. అయితే, అదేసమయంలో నివాసంలో సోదాలు నిర్వ హించటమే గాక.. కవితను అరెస్ట్‌ చేయబోతున్నట్టు బయటకు వార్తలు పొక్క టంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దాదాపు ఆరు గంటల ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌లు హుటాహుటిన కవిత నివాసానికి చేరుకోగా.. వారిని కూడా పోలీసులు లోనికి అనుమతించలేదు. లోపల ఏం జరుగుతున్నదో తాము తెలుసుకోవాలనీ, తాము కవిత కుటుంబసభ్యులమని పోలీసులతో పాటు ఈడీ అధికారులతో కేటీఆర్‌, హరీశ్‌లు వాగ్వాదానికి దిగారు. దాదాపు పది నిమిషాల తర్వాత వారిని అధికారులు లోనికి అనుమతించారు. అప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నమోదైన పీఎంఎల్‌ఏ కేసుకు సంబంధించి నిందితురాలిగా కవితను అరెస్ట్‌ చేసి, ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు ఒక నోటీసును కవిత భర్తకు ఈడీ అధికారులు అందజేశారు. అంతేగాక, ఆ కేసుకు సంబంధించిన మెమోను కూడా భర్తకు అందజేసినట్టు తెలిసింది.
ప్రత్యేక బందోబస్తు నడుమ ఎయిర్‌పోర్టుకు
కాగా, ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఏ విధంగా కవితను ఢిల్లీకి తీసుకెళ్తారంటూ కేటీఆర్‌, హరీశ్‌రావులు ఈడీ అధికారులతో వాదించినట్టు తెలిసింది. ఒకవైపు వారి వాదనలు కొనసాగుతుండగానే, ఈడీ అధికారులు కవిత నివాసంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లను సర్దుకొని కవితను ఢిల్లీకి తీసుకెళ్లటానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ముందుగా, వారు రూపొందించుకున్న వ్యూహం ప్రకారమే ఢిల్లీకి రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌కు ముందస్తుగా టికెట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకపక్క, వెలుపల ఉద్రిక్త వాతావరణం ఉండగానే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ప్రత్యేక బందోబస్తు మధ్య ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.
నేటి సాయంత్రం కోర్టులో హాజరుపర్చే అవకాశం
మరోవైపు, ఢిల్లీలో శనివారం సాయంత్రం 5 గంటల లోపల కోర్టులో హాజరుపరిచే విధంగా ఈడీ అధికారులు సన్నాహాలు పూర్తి చేసుకున్నట్టు తెలిసింది. అంతకముందు, ఢిల్లీలో ఇదే కేసులో తమ కస్టడీలో ఉన్న నిందితుడు అమిత్‌ అరోరాతో కలిపి కవితను విచారించే అవకాశం ఉన్నదని తెలిసింది. దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ స్కామ్‌లో ముడుపులుగా ఆప్‌ నేతలకు కవిత చెల్లించినట్టు వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై, మాగుంట రాఘవ, అశోక్‌ల నుంచి సమాచారాన్ని సేకరించిన ఈడీ.. మున్ముందు దర్యాప్తులో కవితపై పకడ్బందీగా ఉచ్చును బిగించటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ స్కామ్‌లో ఇదివరకే అరెస్టయిన ఆప్‌ మంత్రి మనీశ్‌ సిసోడియా, మరికొందరికి బెయిల్‌ రావటం అతికష్టంగా మారిన నేపథ్యంలో కవిత కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనే వాదన న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తున్నది.

Spread the love