అప్పుల ఊబిలో తెలంగాణ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంపై చర్చ

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ శాసన సభ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. ‘‘ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నాను. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు’’ అని భట్టి అన్నారు.

శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు:

  • 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ..
  • రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
  • 2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.
  • 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
  • 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.
  • 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
  • 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
  • బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
  • 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
  • రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
  • రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
  • రోజూ వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి
  • 2023లో అప్పుల్లో కూరుకుపోయింది.
  • బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ
Spread the love