నవతెలంగాణ హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవే కాకుండా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదన్నారు. ఇద్దరం ఎంపీలం కలిసి సీఈఓతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వివేక్ కాంగ్రెస్‌లోకి రావడానికి సమన్వయం చేసిన వారిని ఈడీ ఇబ్బంది పెడుతోందన్నారు. మోడీ ప్రసంగాలకు, జరుగుతున్న తతంగాలకు పొంతన లేదన్నారు. వీర్లపల్లి శంకర్, బీర్ల ఐలయ్య లాంటి సామాన్యులకు సైతం తాము టికెట్ ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీలో ఉన్నప్పుడు రాముడిగా కనిపించిన వివేక్.. కాంగ్రెస్‌లోకి రాగానే రావణుడేలా అయ్యాడని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నాడు కాబట్టే పొంగులేటిపై దాడులతో హింసిస్తున్నారు. పొంగులేటి బంధువు అయినందుకే రామసహయం సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు’’ అని రేవంత్ తెలిపారు.