నవతెలంగాణ హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణ(Telangana) రాష్ట్రం తోపాటు రాజస్థాన్(Rajasthan), మిజోరం(Mizoram), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తేదీలను అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. అంతే కాదు ఈ రాష్ట్రాల్లో పోలింగ్ నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు వండి వారుస్తున్నాయి.
తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఢిల్లీలో ఎన్నికల పరిశీలకులతో భేటీ జరపనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన హైటెక్నాలజీని ఉపయోగిస్తామని ఈసీ ఇప్పటికే ప్రకటించి ఉంది. ఇందుకోసం పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపిన విషయం విధితమే.