మత కల్లోలాలతోనే బీజేపీ పబ్బం కాంగ్రెస్‌ది..

మత కల్లోలాలతోనే బీజేపీ పబ్బం కాంగ్రెస్‌ది..– భూమాత కాదు.. భూమేత
– కరెంట్‌లో కోతలంటే.. రైతులకు ఎనకటి గతే
– మేం వంట చేస్తే.. వారు వడ్డిస్తరట..
– మోసగాల్ల మాటలు వింటే.. మోసపోతాం
– ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- రంగారెడ్డి/ బడంగ్‌పేట/ జహీరాబాద్‌
మత కల్లోలాలను సృష్టిస్తూ బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని, ప్రజలు ఆ పార్టీని దేశం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను బతికున్నంత కాలం తెలంగాణలో సెక్యులర్‌ పాలనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనకు హిందూ ముస్లింలు రెండు కండ్లలాంటి వారన్నారు. కాంగ్రెసోళ్లు ధరణిని తీసి పెట్టేది.. భూమాత కాదు.. భూ ‘మేత’ అని విమర్శించారు. తెలంగాణ తెచ్చింది.. 24 గంటల కరెంటు ఇచ్చింది.. ఇంటింటికీ మంచినీళ్లు తెచ్చింది.. కేసీఆర్‌యేనని తెలిపారు. ”ఎనుకటికీ ఎవరో అన్నరట.. మీరు మొత్తం వంటలు తయారు చేసి పెట్టుండ్రి.. యాళ్లకు నేనొచ్చి వడ్డిస్తానని..” కాంగ్రెసోళ్ల పరిస్థితి ఇప్పుడు అట్లుందని సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. జహీరాబాద్‌కు మాజీమంత్రి మహమ్మద్‌ ఫరిదోద్దీన్‌ సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన తనకు కుటుంబ మిత్రుడని.. అందుకే అతని కుమారుడిని ఇండిస్టియల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా నియమించామన్నారు. ఇప్పటికే జహీరాబాద్‌ను అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు. మైనారిటీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
జహీరాబాద్‌ ప్రాంతంలోని చాలామందికి కర్నాటక నుంచి బంధుత్వాలు ఉంటాయి కనుక.. అక్కడి పాలనకు, ఇక్కడి పాలనకు బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నారింజ ప్రాజెక్ట్‌ అభివృద్ధి, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పటాన్‌చెరు ప్రాంతానికి మెట్రోరైలు వస్తుందన్నారు.
భూదేవంత ఓపిక ఉన్న నేత.. సబిత
మహేశ్వరం, వికారాబాద్‌లలో జరిగిన సభల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రతి రోజు మంత్రి సబితమ్మ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం చేస్తున్నారని, భూదేవికి ఉన్నంత ఓపిక ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పిదాల వల్లే భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, ఆ సమస్య పరిష్కారం కోసం వంద కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ఎస్‌ఎన్‌డీపీ నిధులతో నాలాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోట్లాది రూపాయలతో చెరువుల అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు ఇంటింటికీ తాగునీటిని అందించినట్టు చెప్పారు. మంత్రి కృషితోనే కందుకూర్‌లో మెడికల్‌, లా జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. పాక్స్‌ఖాన్‌ కంపెనీ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రం మనకైంది.. మన పైసలు మన దగ్గరే ఉంటున్నయి కాబట్టి అభివృద్ధి అంతా సాధ్యమైతావుందని తెలిపారు.
రైతుల భూములు అన్యాక్రాంతం కావొద్దని, ఎవరు పడితే వారు పేర్లు మార్చొద్దని ధరణిని తెచ్చామన్నారు. ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే మంచిదో ఆలోచించి వజ్రాయుధం లాంటి ఓటును సద్వినియోగం చేసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. గత కాంగ్రెస్‌ పదేండ్లలో మైనార్టీల కోసం రూ.2000 కోట్లను మాత్రమే ఖర్చు చేస్తే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లలో రూ.12,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

Spread the love