సర్వేలు..రిపోర్టులతో గుబులు..

Surveys..Bubbles with reports..– స్కెచ్‌ల మీద స్కెచ్‌లు…
– పార్టీ పరంగా, పథకాల పరంగా ఉరుకులు పరుగులు
– సారు వ్యూహం మేరకే ‘పొన్నాల’ సీన్‌
– మాజీ మంత్రి ఇంటికెళ్లిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
– మేనిఫెస్టోలో మరిన్ని తాయిలాలు
– రైతుబంధు, పింఛన్ల పెంపు
– అన్నదాతలకూ పెన్షన్‌, కౌలు రైతులకు ఆర్థిక సాయం
– నేడు అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ భేటీ
– నేడు బీ-ఫామ్‌లను అందజేయనున్న గులాబీ బాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ పరంగా చేసిన సర్వేలు.. పార్టీ పరంగా ఉన్న అంచనాలు.. నిఘా వర్గాలు అందించిన నివేదికలు… వెరసి అధికార బీఆర్‌ఎస్‌లో గుబులు రేగుతోంది. పథకాలు, కార్యక్రమాల మీద ప్రజల్లో సానుకూలతే ఉన్నా, కర్నాటక ఎన్నికల ప్రభావానికి తోడు.. స్థానికంగా ఎమ్మెల్యేల మీదున్న వ్యతిరేకత ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న ఆందోళన ఆ పార్టీ ‘అధినాయకత్వాన్ని’ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఇటు ప్రభుత్వ పరంగా, అటు పార్టీగా పరంగా ఆఘమేఘాల మీద పలు నిర్ణయాలు తీసుకోవటం, వాటిని తక్షణమే అమలు చేయటం మీద సీఎం కేసీఆర్‌ నూటికి రెండొందల శాతం దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం ఆయన స్కెచ్‌ల మీద స్కెచ్‌ లేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆయన వేసిన స్కెచ్‌ ఆధారంగానే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల ఆ పార్టీకి రాజీనామా చేశారనే చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. అలా పొన్నాల రాజీనామా చేశారో లేదో.. ఇలా మంత్రి కేటీఆర్‌ ఆయన ఇంటికి వెళ్లటం, మీరు మా పార్టీలోకి రండి, సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆహ్వానించటమనేది ఇలాంటి వాదనలకు బలం చేకూరుసున్నది. హస్తం పార్టీని మానసికంగా దెబ్బ కొట్టేందుకే బీఆర్‌ఎస్‌ ఇలాంటి ఎత్తుగడలు పన్నుతోందని పలువురు సీనియర్లు అభిప్రాయప డుతున్నారు. మరోవైపు టిక్కెట్‌ దక్కలేదనే కారణంతో మొన్నటి వరకూ అలకపాన్పు ఎక్కిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, తదితరుల ఇంటికి వెళ్లని బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు, ఇప్పుడు అకస్మాత్తుగా పొన్నాల ఇంటికి వెళ్లి, ఆహ్వానించటమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ ఎపిసోడ్‌ మొత్తంలో కారు సారు ‘స్టీరింగ్‌’ గట్టిగానే తిప్పారనే గుసగుసలు వినబడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలతో కంగారు పడుతున్న బీఆర్‌ఎస్‌… వాటిని తట్టుకునేందుకు వీలుగా కొంగొత్త తాయిలాలను తెరపైకి తీసుకురానుంది. వాటిని క్రోడీకరించిన ఎన్నికల ప్రణాళికను సీఎం కేసీఆర్‌ ఆదివారం విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఆయన మేనిఫెస్టోను విడుదల చేసి, అభ్యర్థులతో భేటీ కానున్నారు. రైతు బంధు, ఆసరా పింఛన్ల పెంపు ఎన్నికల ప్రణాళికలో కీలకాంశాలుగా ఉండబోతున్నట్టు సమాచారం. వీటితోపాటు అన్నదాతలకు పెన్షన్‌, కౌలు రైతులకు ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బడుగు, బలహీనవర్గాల వారికి మరిన్ని ఆర్థిక సాయాల వంటికి మేనిఫెస్టోలో ఉన్నాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థులతో భేటీ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయమై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా వివరిస్తారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలతో, ఇక్కడి స్కీమ్‌లను పోల్చి చెప్పటం ద్వారా తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు మధ్యనున్న తేడాను వివరించాలంటూ ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాలకు (నర్సాపూర్‌, గోషామహల్‌, నాంపల్లి, జనగామ) కూడా క్యాండిడేట్లను ప్రకటిస్తారు. జనగామకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సాపూర్‌కు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసిన దరిమిలా… అక్కడ కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించి, బీ-ఫామ్‌లను అందజేయనున్నారు.

Spread the love