లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం

The target is the Lok Sabha elections– బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం జత కట్టాయి
– అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 25, బీజేపి 5,ఎంఐఎం ఒక స్థానానికే పరిమితం
– కేసీఆర్‌తోనే తెలంగాణకు అన్యాయం : రేవంత్‌ రెడ్డి
– కాంగ్రెస్‌లో చేరిన కసిరెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపి, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంల మధ్య కూటమి ఏర్పడిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను ఓడించేందుకు బీజేపీ తన ఓటు బ్యాంక్‌ ను బీఆర్‌ఎస్‌ కు బదిలిచేస్తోందన్నారు. తన దోస్త్‌ కేసీఆర్‌ను గెలిపించేందుకే ప్రధాని మోడీ పదే పదే తెలంగాణకు వస్తున్నారని ఆరోపించారు. అయితే రానున్న అసెంబ్లీ స్థానాల్లో ఈ కూటమి పార్టీలు వేరు వేరుగా పోటిచేస్తాయని, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కలిసి బరిలో ఉంటాయన్నారు. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో … బీజేపీ 7, బీఆర్‌ఎస్‌ 9, ఒక సీట్‌లో ఎంఐఎం పోటి చేయ నుందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలపై వస్తోన్న అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయ న్నారు. బీఆర్‌ఎస్‌ 25 సీట్ల లోపు, బీజేపీ 5 సీట్ల లోపు, ఎంఐఎం 6 సీట్లకు పరిమితం అవుతుంద న్నారు. మొత్తం కూటమికి కలిసి 36 సీట్లు వస్తే… మిగిలినవి కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. బీజేపీ స్టీరింగ్‌ ఆదాని చేతిలో, బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ ఎంఐఎం నేతల హ్యాండ్‌లో ఉందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కేవలం నిషానీలు అని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరారు.
ఆయన వెంట నాగర్‌ కర్నూల్‌ జిల్లా వైస్‌ చైర్మన్‌ బాలా సింగ్‌, కల్వకుర్తికి చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రాజాజీ మార్గ్‌ 10 లో జరిగిన ఈ జాయినింగ్‌ ప్రొగ్రాంలో కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌, సీడబ్ల్యూసీ మెంబర్‌ వంశీ చందర్‌ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ అవసరాల దష్ట్యా వంశీచందర్‌ రెడ్డి తన కల్వకుర్తి సీటును కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారంటూ హరీష్‌రావు, కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం, ధరణి పేరుతో లక్ష కోట్లు, వేల ఎకరాల భూమిని దోచుకున్నారని ఆరోపించారు. దీనిపై ఎం చెప్పాలో తెలియక కేసీఆర్‌ ఫౌం హౌజ్‌లో పడుకుంటే ఈ ఇద్దరు కుక్కల్లా ఊర్లపై తిరుగుతూ, కనిపించిన వాళ్లను కరుస్తున్నా రని ఫైర్‌ అయ్యారు. ‘పదేండ్ల పాలనలో ఏమి చేయ కుండా. కిరాయి మనుషులను తెచ్చి, సార పోసి, బీరు ఇచ్చి, పైసలు పంచి… వాళ్ల ముందు కేసీఆర్‌ శివతాండం చేస్తే, బిల్లా రంగాలిద్దరు సన్నాయి నొక్కు లు నొక్కుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ”కాంగ్రెస్‌ నేతల్ని మరుగుజ్జులని విమర్శిస్తోన్న కేటీఆర్‌… కేసీఆర్‌ ఏమైనా బాహుబలి నా ” అని ప్రశ్నించారు.
ప్రజల సెంటిమెంట్‌ నిర్మాణాల్లోనూ దోపిడీయే…
తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ నిర్మాణాలలో కూడా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. అమర వీరుల స్థూపం నుంచి సెక్రెటేరియట్‌ వరకు అవినీతి జరిగిందన్నారు. అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణంలో రూ. 100 కోట్ల టెండర్లు పిలిచి రూ. 200 కోట్లు చేశారన్నారు. రూ. 64 కోట్లతో టెండర్లు పిలిచిన అమరవీరుల స్థూపం రూ. 200 కోట్లు అయిందన్నారు. రూ. 4 వందల కోట్లతో నిర్మిస్తామన్న సచివాలయం బడ్జెట్‌ రూ. 1400 కోట్లకు చేశారన్నారు. కేసీఆర్‌ లాంటి నీచులు తెలంగాణ సమాజంలోనే లేరని విమర్శించారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం
ప్రజల సంక్షేమం, అభివద్ధే కాంగ్రెస్‌ ప్రాధాన్యత లు అన్నారు. హైదరాబాద్‌ వేదికగా పార్టీ మూడు రోజులు సమీక్షలు జరిపి… ఆరు గ్యారెంటీలు ప్రకటించిందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదని కేటీఆర్‌ ప్రశ్నిస్తున్నారన్నారు. మరి సిద్దిపేట, సిరిసిల్ల , గజ్వేల్‌ లో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేస్తోన్న స్కీంలను తెలంగాణ అంతటా ఎందుకు అమలు చెయ్యడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలోనే సమానమైన అభివద్ధి చేయని సన్యాసులు, దేశమంతా కాంగ్రెస్‌ అమలు చేసే పథకాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో 2004 లో తొలిసారి ఉచిత విద్యుత్‌, ఫీజు రియంబర్స్‌ మెంట్‌, ఆరోగ్య శ్రీ, రైతు రుణ మాఫీ, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, జలయజ్ఞం పేరుతో భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్ట్‌ లను చేపట్టింది కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. జర్నలిస్ట్‌లకు సైతం ఇండ్ల పట్టాలు, బస్‌ పాస్‌లు ఇచ్చింది కాంగ్రెస్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో… అక్కడి ఆదాయం, ప్రజల అవసరాలను బట్టి వివిధ స్కీంలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు తప్పక నెరవేరుస్తామని చెప్పారు.
కేసీఆర్‌ తోనే తెలంగాణకు అన్యాయం…
ఉమ్మడి పాలనలో జరిగిన పాలనతో తమకు సంబంధం లేదన్నారు. అప్పుడు జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం తెలంగాణకు ఏదైనా అన్యాయం జరిగిందంటే అందుకు కేసీఆరే కారణమన్నారు. 60 ఏండ్లలో తాము చేసిన అప్పు రూ. 69 వేల కోట్లు అయితే, 9 ఏండ్లలో కేసీఆర్‌ చేసిన అప్పు రూ. 5.50 లక్షల కోట్లు అన్నారు. రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. లక్షల కోట్ల లోటు బడ్జెట్‌ తో తెలంగాణ మునిగిపోయిందన్నారు.
తెలంగాణలో యూపీఏ1, యూపీఏ 2 (2004-14) వరకు కాంగ్రెస్‌ పాలన, బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలన(2014-24) తీరుపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ కంటే, బీఆర్‌ఎస్‌ పాలన భేష్‌ అని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైందని హెచ్చరించారు. పదేండ్లలో ఏర్పాటు చేయని పసుపు బోర్డు… పది రోజుల్లో సాధ్యామా ? అని ప్రశ్నించారు. దీనిపైన బాండ్‌ పేపర్‌ ఇచ్చిన వారే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Spread the love