అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ భూములివ్వండి

– సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలి
– కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ భూములను త్వరగా బదిలీ చేయాలని రాష్ట్ర మున్సిపల్‌,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌ (ఎస్‌సీబీ) సివిల్‌ ఏరియాల తొలగింపును వేగవంతం చేయాలని, ఎస్‌సీబీ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. మెహదీపట్నం వద్ద స్కైవాక్‌ అభివృద్ధి, హైదరాబాద్‌-కరీంనగర్‌-రామగుండం రోడ్‌ లో ప్యారడైజ్‌ జంక్షన్‌ (జింఖానా గ్రౌండ్స్‌ దగ్గర) నుంచి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ అభివృద్ధి, ఎన్‌హెచ్‌-44లో కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌
జంక్షన్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ అభివృద్ధి, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ప్రాజెక్ట్‌ కింద లింక్‌ రోడ్లు, కొన్ని రోడ్ల విస్తరణ పనులు వంటి ప్రాజెక్టుల కోసం భూమి బదిలీ చేయాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మంత్రి కేటీఆర్‌ వెంట ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జి.రంజిత్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌, రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉన్నారు.
తెలంగాణ అభివృద్ధి చాటాలే…
తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అమరులకు ..అభివృద్ధే అసలైన నివాళి అని తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఐటీ, ఏరో స్పేస్‌, డిఫెన్స్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. తొమ్మిదేండ్లలో హైదరాబాద్‌ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా వచ్చింది గుండు సున్నా అని విమర్శించారు.
హైదరాబాద్‌ లాంటి నగరంలో స్కైవేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా, కేంద్ర ప్రభుత్వ వైఖరి మారలేదని దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదని, జూబ్లీ బస్టాండ్‌ నుంచి రాజీవ్‌ రహదారి వరకు ఒక స్కై వే నిర్మాణం, పారడైజ్‌ చౌరస్తా నుంచి మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ వరకు మరో స్కై వే నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, కానీ ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
రక్షణ శాఖ నుంచి రాజీవ్‌ రహదారి వైపు స్కై వేల నిర్మాణం కోసం 96 ఎకరాల భూమి, మేడ్చల్‌ వైపు మరో 56 ఎకరాల భూమి ఇస్తే అంతే విలువ కలిగిన భూమిని ఇస్తామని చెప్పినా స్పందన లేదని విమర్శించారు. స్కై వేల మాదిరే స్కై వాక్‌ల నిర్మాణాన్ని కూడా చేస్తున్నామని, ఉప్పల్‌లో చేపట్టిన స్కై వాక్‌ పూర్తయిందని, కానీ రక్షణ శాఖ పరిమితుల వలన మెహదీపట్నంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయిందని అన్నారు. గోల్కొండ, ఇబ్రహీం బాగ్‌ లింకు రోడ్ల కోసం అవసరమైన రక్షణ భూమిని కూడా కోరామని, కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జీహెచ్‌ఎంసీకి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు, కమ్యూనిటీ హాళ్లను నిర్మాణం చేస్తామని అన్నారు. తమ వైపు నుంచి ప్రయత్న లోపం లేకుండా గత పది సంవత్సరాలుగా ఈ అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని, ఈసారి అయినా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
నేడు కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో భేటీ
నేడు (శనివారం) పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరిని కలుస్తామని, లక్డీకపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు మెట్రో రైల్‌ విస్తరణ, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో కోసం విజ్ఞప్తి చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు ఈ అంశంలో డీపీఆర్‌లు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్‌ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఎస్‌ఆర్డీపీ కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసామని, కానీ రసూల్‌ పురా వద్ద మూడు, నాలుగు ఎకరాల హౌం శాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్‌ఆర్డీపీ ప్రాజెక్టు పూర్తి అవుతుందని అన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, ఈ విషయంలో అమిత్‌ షాను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కలిసి రావాలని కోరారు. పటాన్‌చెరువు నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో విస్తరణ కు కూడా కేంద్రం కలిసి రావాలన్నారు.
కేంద్రం సహకరించట్లే….
తొమ్మిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించలేదని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని కొనసాగిస్తుందని విమర్శించారు. ఒకవేళ కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో తెల్వదని, కిషన్‌ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా చూపించారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సుమారు 10 చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లో ఎందుకు మెట్రోకి సహకరించాలడం లేదో తెలపాలని అన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే సహకరిం చని కేంద్రం, గుజరాత్‌, ఇతర బీజేపీ రాష్ట్రాల్లో వరదలు వస్తే ఎందుకు నిధులిచ్చిందో కిషన్‌ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. నిస్సహాయంగా ఉన్న కిషన్‌ రెడ్డిని కంటే పెద్ద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తాము ఇవ్వగలమని అన్నారు.
ప్రధానమంత్రి మోడీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్‌లో పెడతారని విమర్శించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు ఘోరంగా విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. ఇప్పటికీ విద్యుత్‌, నీటి సరఫరాలేని గ్రామాలు కూడా దేశంలో ఉన్నాయంటే వీటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదే అన్నారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉందని, అంశాల వారీగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని, అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నామన్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌, బిజెపి కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసని, ఎవరు ఎవరితో కుమక్కు అవుతున్నారో ప్రజలకు తెలుసని అన్నారు.
అత్యంత బలహీనమైన ప్రధాని మోడీ
దేశంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రధాన మంత్రుల్లోకెల్లా అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, మోడీ బలహీనతలను దేశంలో అందరికంటే ఎక్కువగా తమ పార్టీయే విమర్శించిందని అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఢిల్లీలో తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆర్దినెన్సుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో నిలబడతామని, సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్సును కాంగ్రెస్‌ ఏ విధంగా సపోర్ట్‌ చేస్తుందో వాళ్లే చెప్పాలని అన్నారు.

Spread the love