నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం పేరు మార్పు

కాంగ్రెస్‌ ఆగ్రహం
న్యూఢిల్లీ : నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌) పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం, సొసైటీగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెహ్రూ మొమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ సమావేశం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో మ్యూజియం పేరును మార్చాలని నిర్ణయించినట్టు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. దీని పేరును ప్రధానమంత్రుల మ్యూజియం అండ్‌ సొసైటీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ‘జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు ఎంతో మంది ప్రధానమంత్రులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుంది. అందుకే దీని పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదన స్వాగతించదగినది’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రులు అంటే ఓ సంస్థ అని అభివర్ణించిన ఆయన, అందరు ప్రధానుల ప్రయాణాన్ని ఇంద్రధనస్సుతో పోల్చారు. ఇది అందంగా ఉండాలంటే ఇంద్రధనస్సులోని రంగులన్నీ సమపాళ్లలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
అభద్రతాభావంతో ప్రధాని : కాంగ్రెస్‌
దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభద్రతాభావంతో అణగారిపోతున్న సూక్ష్మజీవి అని మండిపడింది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. మన దేశ తొలి ప్రధాన మంత్రి, భారత దేశ రూపశిల్సి జవహర్‌లాల్‌ నెహ్రూకు పేరు, ప్రతిష్టలు, గొప్ప వారసత్వం ఉన్నాయని చెప్పారు. ఆయనను గుర్తు చేసుకుంటూ మ్యూజియం అండ్‌ లైబ్రరీకి ఆయన పేరును పెట్టినట్టు తెలిపారు. ‘చిల్లరతనం, కక్షసాధింపు అంటేనే మోడీ. 59ఏళ్లకుపైగా పుస్తక భాండాగారంగా, ఆర్కైవ్స్‌ ఖజానాగా, గ్లోబల్‌ ఇంటలెక్చువల్‌ ల్యాండ్‌మార్క్‌గా ఎన్‌ఎంఎంఎల్‌ నిలిచింది. దేశ రూపశిల్పి యొక్క పేరు, ఔన్నత్యాలను చెరిపేయటానికి, చులకన చేయడానికి, నాశనం చేయడానికి మోడీ చేయని పని అంటూ ఏదీ లేదు’ అని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. అభద్రతాభావంతో క్రుంగిపోతున్న సూక్ష్మ జీవి స్వయం ప్రకటిత విశ్వగురువు’ అని మోడీని జైరామ్‌ రమేశ్‌ దుయ్యబట్టారు.
ఎన్‌ఎంఎంఎల్‌ సొసైటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడు, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉపాధ్యక్షుడు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, అనురాగ్‌ ఠాకూర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, జి. కిషన్‌ రెడ్డి, నిర్మల సీతారామన్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలోని తీన్‌ మూర్తి క్యాంపస్‌లో ఎన్‌ఎంఎంఎల్‌ ఉంది. ఇక్కడ ఆధునిక, సమకాలిక భారత దేశంపై పరిశోధనలు జరుగుతాయి. 1964 నవంబరు 14న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకష్ణన్‌ దీనిని ప్రారంభించారు.

Spread the love