గుడిసె వాసులపై పోలీసుల దాడి అమానుషం..

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు సీపీఐ(ఎం)వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలపై పోలీసులు అమానుషంగా దాడిచేసి జేసీబీ, డోజర్లు పెట్టి గుడిసెలు నేలమట్టం చేశారనీ, అడ్డుకున్న 60 మంది మహిళలను విఫరీతంగా కొట్టి గాయపరిచారనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, డీజీ నర్సింహారావు, రాష్ట్ర నాయకులు జి రాములు, ఆర్‌ వెంకట్రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో 255 సర్వేనంబర్‌లో 220 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనీ, అందులో 50 ఎకరాల్లో రాళ్ళు, బోళ్ళు ఉన్నాయని తెలిపారు. దానిలో 50 ఎకరాలు ప్రభుత్వం కొందరికి అసైన్డ్‌ చేసిందని పేర్కొన్నారు. ఆయా భూములను అసైన్‌దారులు అమ్ముకున్నారని తెలిపారు. అదే సర్వే నెంబర్‌లో మరో 50 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వారు ఆక్రమించారని పేర్కొన్నారు. ప్లాట్లు చేసి అమ్మకుంటుండగా ఆ భూమిలో సీపీఐ(ఎం) అధ్వర్యంలో మూడు వేల మంది పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమిని అమ్ముతుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎలాంటి చర్యలు. తీసుకోలేదని గుర్తుచేశారు. కానీ పేదలు గుడిసెలు వేస్తే వాటిని ప్రభుత్వం మూడు సార్లు తొలగించిందనీ, 30 మంది మీద బైండోవర్‌ కేసులు, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శితో పాటు మరో 10 మంది మీద రెండు నాన్‌బెయిలబుల్‌ కేవలు పెట్టి జైలుపాలు చేసిందని తెలిపారు. గుడిసెలు వేసుకున్న పేదలంతా తమకు ఆ భూమిలో ఉండ్ల స్థలాలు, వాటికి పట్టాలివ్వాలని అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. ఆయా భూములను దోబీఘాట్‌కు కేటాయించినట్టు బుకా యిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా పేదలు ఎన్నో అవస్థలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాలుగో సారి పేదలు గుడిసెలను వేసుకుని నివాసముంటుండగా మంగళవారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీస్‌, ఫారెస్ట్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది ఒక్కసారిగా దాడి చేసి గుడిసెవాసులపై విపరీతంగా లాఠీఛార్జీ చేశారని తెలిపారు. ఈ క్రమంలో 60 మంది గాయపడ్డారని తెలిపారు. డోజర్లు, జేసీబీలతో గుడిసెలన్నింటినీ నేలమట్టం చేసి వారి బియ్యం, కూరగాయలు, వంట సామాన్లు, బట్టలు, ఇతర నిత్యావసరాలను నేలపాలు చేసినారని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love