విభజన హామీలపై పెదవి విప్పని మోడీ

– కేసీఆర్‌ కుటుంబంపై ఎదురుదాడికే అధిక సమయం
– ఆశించిన జనం లేక ప్రాంగణం వెలవెల
– సభలో నిలదీస్తారనే అనుమానంతో..
–  కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ నేతల ముందస్తు అరెస్ట్‌
నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విమర్శలకే అధిక సమయం కేటాయించారు. రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు రాష్ట్రానికి వచ్చిన మోడీ ఈ సారైనా తప్పకుండా మాట్లాడతారని ఆశించిన రాష్ట్ర ప్రజలకు మళ్లీ నిరాశే ఎదురైంది. అవినీతి గురించి బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు గతంలో చెప్పిన అంశాలనే పునరుద్ఘాటించా రు. ప్రధాని పర్యటనలో నిరసన తెలుపుతారనే అనుమానం తో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ నేతలను ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించడం విమర్శలకు తావిచ్చింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై సభలో మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసి ందే. ఇక ఈ విజయ సంకల్ప సభలో ఆశించిన మేర జనం లేక సభా ప్రాంగణం వెలవెలబోయింది. కార్యకర్తలు కూడా తక్కువ సంఖ్యలో హాజరుకావడం గమనార్హం. వేసిన కుర్చీలు కూడా ఖాళీగా కనిపించాయి. వచ్చినవారూ సభ ముగిసేవర కూ కూర్చోలే దు. కొంతమంది మధ్యలోనే లేచి వెళ్లిపోవడం కనిపించిం ది.ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌ పర్యటనలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై పెదవివిప్పకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటులో భాగంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి న విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీఎం కేసీఆర్‌ సైతం వీటిపై బహిరంగంగానే ప్రశ్నించారు. వామప క్షాలు ఆందోళనలు చేశాయి. విభజన హామీలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. అయితే, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కేంద్రం నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయడం గమనార్హం. విభజన హామీల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడం కోసమే మోడీ.. కేసీఆర్‌ కుటుంబం అవినీతి అంటూ మాట్లా డటం విడ్డూరంగా ఉందని విపక్ష నేతలు మండిపడ్డారు.
నిరసన తెలిపిన ఎల్‌హెచ్‌పీఎస్‌
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హె చ్‌పీఎస్‌) మోడీ పర్యటన సందర్భంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. వరంగల్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ‘గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది..?’, ‘మామునూరు ఎయిర్‌పోర్ట్‌ ఏమైంది?’ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
విపక్ష నేతల అరెస్టులు
ప్రధాని పర్యటన సందర్భంగా ముందస్తుగా కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, నేతలను పోలీసులు అరెస్టు చేసి పలు పోలీసుస్టేషన్‌లకు, మడికొండలోని పోలీసు ట్రైనింగ్‌ కాలేజీకి తరలించారు. హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డిని, కాంగ్రెస్‌ నేత జంగా రాఘవరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.రంగయ్య, కార్యదర్శివర్గ సభ్యులు నలిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కన్వీనర్‌ బొట్ల చక్రపాణి, నాయకులు బానోతు, మంద సంపత్‌, కాడబోయిన లింగయ్య తదితరులను మడికొండ పీటీసీకి తరలించారు. ప్రధాని తిరిగి వెళ్లిపోయాక సాయంత్రం 4.00 గంటలకు నేతలను వదిలిపెట్టారు.

Spread the love