మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత

– నవతెలంగాణ బ్యూరో –బంజారాహిల్స్‌/ హైదరాబాద్‌
రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి(92) మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా తన తండ్రి సోలిపేట రామచంద్రారెడ్డి ప్రజాజీవితంలో మచ్చలేని ఓ తెల్లని కాగితం వల్లె ఉన్నారని ఆయన కుమారుడు ఎస్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవనంది.. చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారని చెప్పారు.
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. రామచంద్ర రెడ్డి సిటీ కాలేజీలో పట్టభద్రులై రాజకీయాల్లోకి వచ్చారు. చిట్టాపూర్‌ సర్పంచ్‌గా, దొమ్మాట శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మాజీ ఎంపీ సోలిపేట మృతి పట్ల కాసాని సంతాపం
రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి మతి పట్ల తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ సంతాపాన్ని తెలి యజేశారు. తొలి తరం కమ్యూనిస్టు నేత, తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట రామ చంద్రారెడ్డి, రాజకీయాలలో మచ్చలేని నాయ కునిగా జీవించారని గుర్తు చేశారు.
సర్పంచ్‌ పదవితోపాటు సమితి అధ్యక్షునిగా, జిల్లా సహకార బ్యాంక్‌ అధ్యక్షునిగా, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పలు హోదాల్లో ప్రజాసేవ చేశారని చెప్పారు. ఆయన ఆత్మకుశాంతి చేకూ రాలని ఆకాక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కాసాని జ్ఞానేశ్వర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయనది ఆదర్శవంతమైన జీవితం : సీఎం కేసీఆర్‌ సంతాపం
రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంతాపాన్ని ప్రకటిం చారు.తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనదని సీఎం తెలిపారు. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సిద్ధిపేట ప్రాంత వాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో సోలిపేట ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందని తెలిపారు. రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పో యిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంపట్ల రాష్ట్ర శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు హరీశ్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి తది తరులు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీపీఐ(ఎం) నివాళి
సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ.జీ.నర్సింహారావు సోలిపేట రామచంద్రారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బెఫీ సంతాపం
సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ) సంతాపం తెలిపింది. ఈ మేరకు బెఫీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకట్రామయ్య, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.వి.హరీశ్‌ బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కె.తిలక్‌, ఉపాధ్యక్షులు ఎన్‌.సుందర్‌ రామ్‌ ప్రసన్న తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love