విధానాలపై పని చేసే వారిని చట్టసభలకు పంపించాలి

– మూడుముక్కలాట తీరులో రాజకీయ పార్టీలు
– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మంచి విధానాలపై పని చేసే వారిని చట్టసభలకు పంపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూటకో పార్టీ రోజుకో పార్టీ మారే నాయకులు తయారయ్యారని, ప్రజా సంక్షేమాన్ని మరిచి సొంత స్వలాభం.. స్వార్థం కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొందని, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నాయకుల తీరు అసహ్యించుకునే రీతిలో ఉందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలు లేవని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్మును దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు కరువయ్యారని, విధానాలపై మాట్లాడేది కేవలం వామపక్షాలేనని చెప్పారు. వామపక్షాల ప్రతినిధులు చట్టసభల్లో ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలు ఈ విషయాలను గుర్తుంచుకొని ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, జిల్లా నాయకులు రవినాయక్‌, రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love