సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలాగా భావించారు

–  డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ జయంతి సభలో సీఎల్పీ నేత విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు కండ్లలాగా భావించారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పేద, మధ్యతరగతి పిల్లలు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతో స్కాలర్‌ షిప్స్‌ ఇచ్చారని తెలిపారు. రాజకీయాలకు కుల, మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. డ్వాక్రా రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వైఎస్‌ఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం దాహార్తి తీర్చేందుకు కష్ణ, గోదావరి నది జలాలను నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. ఐదేండ్లలో లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశ పెట్టిన గొప్ప దార్శనికుడని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే లక్ష్యం ఉండేదనీ, దాన్ని సాకారం చేసేందుకు అహర్నిశలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌, మహేష్‌కుమార్‌గౌడ్‌, మల్లు రవి, కేవీపీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love