– అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా వరసగా రెండో రోజునా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్ము- శ్రీనగర్ హైవేపై కొండ చరియలు విరిగిపడ్డంతో పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ శనివారం యాత్రను నిలిపివేశారు. దారి మధ్యలో చిక్కుకునిపోయిన యాత్రికులను భారత సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బరారీ మార్గ్ క్యాంపులో 253 మంది యాత్రీకులు, చందన్‌వారీ క్యాంపులో 126 మంది యాత్రికులను సురక్షితంగా ఉంచినట్లు ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. యాత్రీకులకు అవసరమైన సహాయాన్ని భారత సైన్యం అందిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలకు తోడు, ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయినట్లు చెప్పారు. ముందు రోజు శుక్రవారం కూడా యాత్రను నిలిపివేయడంతో మొత్తంగా వేలాది మంది యాత్రీకులు వివిధ ప్రదేశాల్లో చిక్కుకునిపోయినట్లు సమాచారం. ఇందులో వందలామంది తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రీకులు కూడా ఉన్నారు. నువ్వాన్ బేస్, భగవతి నగర్ బేస్ క్యాంపు, పంచతర్ణి క్యాంపుల్లో వందలాది మంది నిలిచిపోయారు. కేవలం పంచతర్ణి క్యాంపులోనే దాదాపు 1500 మంది వరకూ యాత్రీకులు ఉన్నారు. మరోవైపు, జమ్ము నుంచి కాశ్మీర్ లోయకు వెళ్లేందుకు కొత్త యాత్రీకులనెవ్వర్నీ అధికారులు అనుమతించలేదు. దీంతో చందర్‌కోట్ ప్రాంతంలోని రాంబన్ యాత్రి నివాస్ క్యాంపు వద్ద సుమారు 4,600 మంది యాత్రీకులు చిక్కుకుని పోయారు. అలాగే, కొండచరియలు విరిగిపడ్డంతో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని కూడా అధికారులు మూసివేశారు. దీంతో హైవేపై దాదాపు 600 వాహనాలు నిలిచిపోయాయి. జమ్ముకాశ్మీర్‌లో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు వరదలతో పాటు కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ నెల 1న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయింది. ఇప్పటి వరకూ 82 వేల మంది అమర్‌నాథ్‌ను సందర్శించుకున్నారు. ఆగస్టు 31 వరకూ ఈ యాత్ర కొనసాగనుంది.