అమృత్‌కాల్‌ అంటే ఇదేనా..?

– పీఎస్‌యూల్లో రెండు లక్షల ఉద్యోగాలు మాయం
– ఇది ఏ రకమైన ప్రగతి అవుతుంది?
– ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణ చేసే కుట్ర కాదా? : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ : దేశంలోని నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూలు) నుంచి రెండు లక్షల ఉద్యోగాలను తొలగించడం ఏ రకమైన ప్రగతి అవుతుందని ప్రశ్నించారు. దేశంలో ఉద్యోగాలు తగ్గిపోవడం దేనికి సంకేతమన్నారు. కొంతమంది పెట్టుబడిదారి మిత్రుల ప్రయోజనం కోసం యువకుల ఉపాధి అవకాశాలపై కేంద్రం నీళ్లు చల్లుతున్నదని ధ్వజమెత్తారు. పీఎస్‌యూలు దేశానికి గర్వకారణమనీ, వాటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రగతిశీల దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతాయా? అని ప్రశ్నించారు. ”పీఎస్‌యూలలో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండగా, 2022లో 14.6 లక్షలకు తగ్గిపోయాయి. ఉద్యోగాలు తగ్గించడమే దేశ ప్రగతా? బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1,81,127 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎస్‌ఎఐఎల్‌లో 61,928, ఎంటీఎన్‌ఎల్‌లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్‌జీసీలో 21,120 మంది ఉద్యోగాలు కోల్పోయారు” అని ఓ ట్వీట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు.
ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?
యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాహుల్‌ ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనకు బదులు రెండు లక్షల పైగా ఉద్యోగాలను తగ్గించేసిందని విమర్శించారు.

Spread the love