బస్సు యాత్రను అడ్డుకునేందుకు ఖాకీల కుట్ర

– గంటసేపు పోలీసు స్టేషన్‌లో బస్సు డ్రైవర్‌పై దాడి
–  గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్‌ అరెస్ట్‌, విడుదల
– రియల్టర్ల ప్రోద్బలంతో మహబూబాబాద్‌ పోలీసుల ఓవర్‌ యాక్షన్‌
– బ్రేకులేస్తే బస్సు ఆగుద్దేమో.. యాత్ర కాదు : ఎస్‌. వీరయ్య
బస్సు యాత్రను అడ్డుకునేందుకు ఖాకీ కుట్ర
నవతెలంగాణ – మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ పోలీసులు మరోసారి దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కబ్జాల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు గుడిసెలు వేసి పోరాటం చేస్తున్న పేదలపై దమనకాండ సాగించిన పోలీసులు, ఇప్పుడు వారిని పరామర్శించేందుకు వెళ్లినవారిపై కూడా అదే దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. తెలంగాణా ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకత్వం పేదలను పరామర్శించేందుకు ఆదివారం ప్రత్యేక యాత్ర బస్సులో వెళ్తుండగా దానికి బ్రేకులేసేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఘటనా స్థలానికి యాత్ర బస్సును వెళ్లకుండా తొలుత పోలీసులు అడ్డుకున్నారు. అయినా వేదిక నాయకులు బస్సు దిగి నడిచి ఘటనా స్థలానికి వెళ్లారు. నాయకులు కొద్దిదూరం వెళ్లగానే రెచ్చిపోయిన పోలీసులు యాత్ర బస్సు డ్రైవర్‌ సురేష్‌పై చేయి చేసుకున్నారు. బలవంతంగా బస్సును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరాంనాయక్‌నూ అరెస్టు చేశారు. ఈ ఘటనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కెమెరామెన్లపై దాడి చేశారు. సెల్‌ ఫోన్లు లాక్కున్నారు. విషయం తెలుసుకున్న పేదలు ఒక్కసారిగా పోరాట కేంద్రం నుంచి రోడ్డు మీదకు వచ్చే ప్రయత్నం చేయడం, మరోవైపు అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో పోలీసులు వెనక్కు తగ్గి బస్సును వదిలేశారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాలోని కోదాడకు బస్సు ప్రయాణమైంది. ఆదివారం మహబూబాబాద్‌లో ప్రజాసంఘాల పోరాట వేదిక బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించిన 20నిమిషాలకే పై ఘటన జరిగింది. యాత్ర ప్రారంభానికి ముందు మార్కెట్‌ యార్డు వద్ద ఉన్న స్థలంలో భారీ బహిరంగ సభ జరిగింది. సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అందులో మాట్లాడారు. సభ జరుగుతుండగానే సభా ప్రాంగణం పక్కనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పోలీసులకు సకల మర్యాదలు చేశారు. ఈ విషయాన్ని కూడా బహిరంగ సభలో వక్తలు ఎండగట్టారు. బహిరంగ సభ ముగిసి, బస్సు యాత్ర ప్రారంభమైన 20 నిమిషాల అనంతరం పోలీసులు విశ్వరూపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్‌ వీరయ్య మాట్లాడుతూ.. ‘పేదల ఇండ్లస్థలాల కోసం చేపట్టిన తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక బస్సు యాత్రను మహబూబాబాద్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీనిని ఆపివేయాలని కుట్ర చేశారు. ‘బ్రేకులు బస్సులకుంటాయి.. యాత్రకుండవ్‌.. ఒకవేళ యాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దీనికి పోలీసులదే పూర్తి బాధ్యత’ అని అన్నారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ప్రోద్భలంతో పేదలపై ఇప్పటికే అనేక సార్లు మహబూబాబాద్‌ పోలీసులు దాడి చేశారని, వాస్తవానికి పేదల సంక్షేమమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదానికి వ్యతిరేకంగా వీరు పని చేస్తున్నట్టుందని వీరయ్య విమర్శించారు.

Spread the love