ఉక్రెయిన్‌ లో నాటో హద్దు మీరటానికి ఇంకా ఏమి మిగిలింది?!

అమెరికా, నాటో దేశాలు అనేక నెలలుగా ప్రోత్సహిస్తున్న ఉక్రెయిన్‌ ”వసంతకాలపు ప్రతిదాడి” రెండు వారాలుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేకపోగా ఉక్రెయిన్‌ సైనిక దళాలు ఊహాతీతంగా హతమౌతున్నాయి. ఈ దాడిలో 38 చదరపు మైళ్ళ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి రోజుకు 1000మంది చొప్పున 12000మంది ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలను కోల్పోయారు. రష్యన్‌ మిసైళ్ళు, డ్రోన్ల దెబ్బకు అనేక జర్మన్‌ లియోపర్డ్‌ ట్యాంకులు, అమెరికన్‌ బ్రాడ్లే ఇన్ఫాన్ట్రీ వాహనాలు కుప్పయ్యాయి.
ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తరువాత ఒకటిన్నర సంవత్సరాలపాటు అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ కు ఆధునిక ఆయుధాలను సరఫరా చేయటంద్వారా, ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని అందించటం ద్వారా రష్యాను ఓడించటం సాధ్యమని భావించాయి. ఉక్రెయిన్‌ లో జరుగుతున్నప్రాణనష్టం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా బైడెన్‌ నాయకత్వంలోని నాటో వినాశకరమైన విధానాన్ని అవలంభిస్తోంది. అయితే రోజురోజుకూ ఉక్రెయిన్‌ సైన్యం సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఒక అంచనా ప్రకారం దాదాపు ఒక లక్ష మంది ఉక్రెయిన్‌ సైన్యం యుద్ధ క్షేత్రంలో మరణించారు. సైనిక దళాలలో చేరటానికి యోగ్యతగల జనాభాలో గణనీయ భాగం యుద్ధంలో మరణించటమో లేక గాయపడటమో జరిగింది. ఈ వాస్తవాన్ని నిన్నటిదాకా పశ్చిమ దేశాల మీడియా దాచిపెట్టింది.
ఈ నేపథ్యంలో నాటో దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సమావేశం శక్రువారం ముగిసింది. ఈ సమావేశంలో నాటో, ఉక్రెయిన్‌ సైనిక మైత్రిని గురించి చర్చించారు. లిథ్యూనియా రాజధాని విల్నియస్‌ లో జరగనున్న సమావేశంలో ఉక్రెయిన్‌ ను నేరుగా నాటోలో చేర్చుకోవటమా లేక ఏదోఒక విధమైన ”భద్రతాహామీలు” ఇవ్వటమా అనేది తేలుతుంది. అయితే అసలు విషయం ఉక్రెయిన్‌ నాటోలో చేరటం కాదు. నాటో ఉక్రెయిన్‌ లో ”ప్రవేశించటం” ద్వారా యుద్ధాన్ని తీవ్రతరం చేయటం. ఉక్రెయిన్‌ ను నాటోలో హడావిడిగా చేర్చుకునే ప్రయత్నం చేయటానికిగల కారణం యుద్ధాన్ని తీవ్రతరం చెయ్యటానికే. రష్యాని యుద్ధంలో ఓడించటం ద్వారా రష్యాలో ఒక సంక్షోభం స్రుష్టించి పుతిన్‌ ప్రభుత్వం పతనం అయ్యేలా చూడటమే లక్ష్యంగా అమెరికా నాయకత్వలోని నాటో దేశాలు తమ యావత్‌ ప్రతిష్టను పణంగా పెట్టాయి.
ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రతరం కావటమంటే ఘర్షణలో నాటో ప్రత్యక్షంగా పాలుపంచుకోవటమే. ఉక్రెయిన్‌ యుద్ధంలో తాము అది, ఇది చేయబోవటంలేదని చెప్పటం, అలా చెప్పిందే చేయటం నాటో దేశాలకు ఆనవాయితీగా మారింది. ట్యాంకులు, యుద్ధ విమానాలు, ఆయుధాలు ఒకటేమిటి అన్నీ తమకు పట్టవని చెప్పి ఉక్రెయిన్‌ కు సరఫరా చేసినవే. ఉక్రెయిన్‌ లో మిలిటరీ పరిస్థితి క్షీణిస్తున్న స్థితిలో నాటో దాటబోయే ”హద్దు” ఏమిటి? దీనికి అనేక సాధ్యతలున్నాయి. మొదటిది, ఉక్రెయిన్‌ ను ”నో ఫ్లై జోన్‌” గా ప్రకటించి నాటో యుద్ధ విమానాలు రష్యా దళాలతో తలపడటం. రెండవది, నాటో దళాలలు ప్రత్యక్షంగా యుద్ధ క్షేత్రంలో పాల్గొనటం. మూడవది, యుద్ధంలో రష్యా విజయాన్ని ఆపటానికి అణ్వాయుధాలను పరిమితంగా ఉపయోగించటం.ప్రచ్చన్న యుద్ధ కాలంలో సంప్రదాయ సైనిక దళాలు అప్రతిహతంగా ముందుకు సాగుతున్నప్పుడు (ప్రస్తుత ఉక్రెయిన్‌ సైనిక దళాలకు ఎదువరౌతున్నటువంటి) ఎదురయ్యే పరిస్థితులను అధిగమిం చటానికి టాక్టికల్‌ అణ్వాయుధాలను ఉపయోగించటం అవసరమని అమెరికన్‌ వ్యూహకర్త హెన్రీ కిసింజర్‌ 1957లో రాసిన ”అణ్యస్త్రాలు- విదేశాంగ విధానం” గ్రంథంలో సూచించాడు. యుద్ధంలో జనావాసాల పైన కాకుండా అలా పరిమితంగా అణ్వస్త్రాలను వాడినప్పుడు అది అణు వినాశనానికి దారితీయదని, అది యుద్ధం జరుగుతున్న ప్రాంతానికే పరిమితమౌతుందని ఆయన వాదించాడు. హెన్రీ కిసింజర్‌ వ్యూహంలో ప్రధాన లోపం ఏమంటే అమెరికా అణ్వస్త్ర దాడికి గురైన దేశం పరిమితంగా ఆయన ఊహించిన విధంగా స్పందిస్తుందని భావించటం. 2015లో సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ తయారు చేసిన పేపర్‌ లోను, 2019లో ఫారిన్‌ అఫైర్స్‌ జర్నల్‌ లో ఎల్బ్రిడ్జ్‌ కోల్బీ రాసిన ”మీకు శాంతి కావాలంటే అణుయుద్ధానికి సంసిద్దం కావాలి” అనే వ్యాసంలో పరిమితంగా అణ్వస్త్రాలను వాడటంవలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించటం జరిగింది. ఇటువంటి మతిలేని అవగాహనతోనే అమెరికా స్థానికంగా ఉపయోగించటానికి వీలుపడే అణ్వాయుధాలను తయారు చేస్తోంది. రష్యాను వ్యూహాత్మకంగా ఓడించే లక్ష్యం కోసం అమెరికా, నాటో దేశాలు తమ యావత్‌ ప్రతిష్టను ఫణంగా పెట్టాయి. ఒకవైపు అమెరికాలో చెలరేగుతున్న సామాజిక, ఆర్థిక సంక్షోభం, మరోవైపు ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం సంక్షోభంలో పడటంతో అమెరికా పాలక వర్గాలు గంగ వెర్రులెత్తిపోతున్నాయి. మానవాళి భవితను ప్రశ్నార్థకం చేయటం అమెరికా పాలక వర్గాలకు కొత్తకాదు. అవసరంలేని యుద్ధాలలో లక్షాలాది ప్రజల ప్రాణాలను తీసిన చరిత్ర అమెరికా స్వంతం. కాబట్టి మానవాళిని ఈ యుద్ధం తుదముట్టించకముందే యుద్ధాన్ని అపాలి.
– నెల్లూరు నరసింహారావు

Spread the love