వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన సాయంగా 210కోట్ల డాలర్లు అదనంగా అందచేయనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. కాగా, రష్యాపై సుదీర్ఘ స్థాయిలో పోరును కొనసాగించాలని ఉక్రెయిన్ భావిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ సాయంలో పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలకు అదనపు ఆయుధాలు, హక్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, 105ఎంఎం, 203ఎంఎం ఆర్టిలరీ రౌండ్లు, లేజర్ గైడెడ్ రాకెట్ వ్యవస్థలు తదితర ఆయుధాలు కూడా వున్నాయని రక్షణ విభాగం తెలిపింది. అమెరికా వద్ద వున్న నిల్వల నుండి ఆయుధాలు తీసి పంపించడం కాకుండా ఆయుధ వ్యాపారుల నుండి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు బైడెన్ ప్రభుత్వాన్ని అనుమతించారు.
ఆయుధ వ్యవస్థల లభ్యత, వాటి ఉత్పత్తిని బట్టి వీటిని ఎప్పుడు అందచేసేది ఆధారపడి వుంటుంది. రష్యాతో సుదీర్ఘ పోరాటానికి ఉక్రెయిన్ సిద్ధపడినట్లు కనిపించగానే అమెరికా ఈ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనీషియేటివ్ (యుఎస్‌ఎఐ) కింద పెంటగన్ ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు 700కోట్ల డాలర్లకు పైగా సాయాన్ని అందించింది.
ఐదు విడతలుగా ఈ సాయం అందింది. ఈ నెల 8న బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్‌తో జరిగిన సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు అవసరమైనంత కాలమూ అవసరమైన సాయాన్ని అందచేయగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.