ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16లపై రష్యా మండిపాటు

మాస్కో : ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు అందచేయాలనే పశ్చిమ దేశాల నిర్ణయంపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయాలనే పశ్చిమ దేశాల కుట్రను ఈ నిర్ణయం మరోసారి వెల్లడిస్తుందని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్‌ గ్రుష్కో విమర్శించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల సహాయం ఎంత ఉన్నప్పటికీ, ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించి రష్యా తన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన అన్ని మార్గాలను కలిగి ఉందని గ్రుష్కో తెలిపారు. ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16లు అందించడంపై ఇటీవల అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ మాట్లాడుతూ ‘ఎఫ్‌-16 వంటి అధునాత యుద్ధ విమానాలపై ఉక్రెయిన్‌ పైలట్లకు శిక్షణ ఇచ్చే ఉమ్మడి కార్యక్రమానికి వాషింగ్టన్‌ ఎప్పుడూ మద్దతు ఇస్తుంది’ అని చెప్పారు. ఈ విమానాలను ఎప్పుడు సరఫరా చేయాలి, ఎన్ని చేయాలి అనే విషయంపై మా మిత్ర దేశాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పందిస్తూ అమెరికా తన సొంత లక్ష్యాలను సాధించుకోవడానికి ‘నకిలీ మానవతా వాదం’ ముసుగు వేసుకుందని విమర్శించారు.

Spread the love