కాంగ్రెస్‌ భరోసా… తెలుగులో నేడు మ్యానిఫెస్టో విడుదల

– నాలుగు ఇండిస్టీయల్‌ కారిడార్ల ఏర్పాటు
– రాష్ట్రంలో సుప్రీం కోర్టు బెంచ్‌తోపాటు పలు హామీలు ఇవ్వనున్న హస్తం పార్టీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ భరోసా కల్పించనుంది. కొన్ని వాగ్దానాలు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కీలక నేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జాతీయస్థాయిలో రూపొందించిన మ్యానిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి అన్ని వైపులా నాలుగు ఇండిస్టీయల్‌ కారిడార్లను ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్‌ భరోసా ఇవ్వనుంది. తద్వారా ఆయా వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడంతోపాటు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మాట ఇవ్వనున్నట్టు తెలిసింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సుప్రీం కోర్టు బెంచ్‌ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని హస్తం పార్టీ హామీ ఇవ్వనుంది. దీంతో దక్షిణ భారత దేశానికి రాష్ట్రం న్యాయ కేంద్రంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం పలు హామీలను ఇచ్చింది. పదేండ్ల బీజేపీ పాలనలో వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో దాన్ని ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని రాబట్టడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. తమ మ్యానిఫెస్టో ద్వారా అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీలను దెబ్బకొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నికల నినాదంగా మారిందనీ, తెలంగాణ ఉద్యమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ దీన్ని ఎజెండాగా చేసుకున్న విషయాన్ని గుర్తు చేయనుంది. ఖాజిపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా తెలంగాణ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దాన్ని సాధించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప విభజన హామీలు ఏమయ్యాయో కూడా చెప్పటం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయినిగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధిస్తామని ముఖ్యమంత్రి మ్యానిఫెస్టో ద్వారా భరోసా ఇవ్వనున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ సర్కారు ఈ ప్రాజెక్టుపై తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిందంటూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్త్తోన్న విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్టుమెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)ను గత యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. దీని ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ప్రత్యక్షంగానో, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా వేసింది. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కమలం, కారు పార్టీలు నిర్వీర్యం చేశాయని కాంగ్రెస్‌ ఇప్పటికే అనేకసార్లు ఆరోపించింది. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పునరుద్ధరించే చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించనుంది. ముఖ్యంగా ఐఐఎం, నవోదయ, సైనిక స్కూల్స్‌ ఏర్పాటుకు హామీ ఇవ్వనుంది. మొత్తంగా 25 అంశాలతో కూడిన కాంగ్రెస్‌ తెలుగు మ్యానిఫెస్టోలో విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Spread the love