నేడు కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

నేడు కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ– పది లక్షల మందితో తుక్కుగూడ జన జాతర
– ఐదుగ్యారంటీలతో దేశ ప్రజలకు భరోసా
– తెలుగులో మ్యానిఫెస్టో విడుదల
– హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంకగాంధీ, రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు ఎన్నికల శంఖారావం పూరించనుంది. పది లక్షల మందితో భారీ బహిరంగ సభ తలపెట్టింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతరను తలపించేలా భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది. ఈవేదిక నుంచి దేశ ప్రజలకు ఐదు గ్యారంటీలతో భరోసా ఇవ్వనుంది. శుక్రవారం ఢిల్లీలో ఇప్పటికే ఏఐసీసీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్‌… శనివారం జనజాతర సభలో తెలుగు అనువాద మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
మూడు భారీ వేదికలు…ఏర్పాట్లు పూర్తి
కాంగ్రెస్‌ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 70 ఎకరాల్లో రాజీవ్‌గాంధీ పేరుతో ప్రాంగణం, 50 ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేసింది. ఈ సభకు పది లక్షల జనాన్ని తరలించనున్నారు. మ్యానిఫెస్టోను రాహుల్‌గాంధీ విడుదల చేయనున్నారు. సభా ప్రాంగణంలో మూడు భారీ వేదికలు ఏర్పాటు చేసింది. మొదటి వేదికపై ఏఐసీసీ అగ్రనేతలతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు ఆశీనులు కానున్నారు. రెండో వేదికపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సీనియర్‌ నాయకులు కూర్చొనేలా ఏర్పాటు చేసింది. మూడో వేదిక కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. వందలాది మంది కళాకారులతో ఆటా,పాటలతో ప్రజలను ఉత్తేజపరించేందుకు రెడీ అవుతున్నది.
మోడీకి దీటైన సమాధానం
పదేండ్ల నరేంద్రమోడీ ప్రభుత్వ నియంతృత్వ, దుష్పరిపాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు తుక్కుగూడ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదిక నుంచే మోడీకి దీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నది. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో తెలియజేసే మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. దీంతో తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజలతోపాటు దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ, ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. జన జాతర వేదికగా తమ బలం చాటి చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో సమరోత్సాహం నింపేందుకు పార్టీ నేతలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేశానికి ఎంతో కీలకమైన బహిరంగ సభపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రెండు సార్లు ప్రత్యేకంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులంతా సభ ఏర్పాట్లను పరిశీలించారు. పది లక్షలకు తగ్గకుండా ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలకు ఆదేశాలిచ్చారు.
ప్రజా పాలనే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపుదల వంటి గ్యారంటీలను అమలు చేస్తున్నది. వంద రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టింది. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమతోపాటు ఇతర అనేక కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నింటికీ తుక్కుగూడ వేదిక మీద నుంచి దేశ ప్రజలకు కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం తెలియజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలు, ఆరు గ్యారంటీల తరహాలోనే తాము కేంద్రంలోకి అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామో కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం చాటి చెప్పనుంది. ఇదే తుక్కుగూడ వేదికగా గతేడాది సెప్టెంబరు 17న విజయభేరి నిర్వహించిన రోజు చెప్పిన ప్రతి మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామనీ, అందుకే అదే తుక్కుగూడ వేదికగా జనజాతర సభలోనూ దేశ ప్రజలకు తాము ఏం చేయబోతున్నామో వెల్లడించను న్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Spread the love