ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహలతో కలిసి బుధవారం సీఎం సచివాలయంలో ధరణి (Dharani Portal) పై సమీక్షించారు. ధరణి పోర్టల్‌పై సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్‌, టైటిల్‌ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చిందన్న సీఎం.. ఆ నిధులు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్‌, పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్‌ మిట్టల్ ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్‌ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యల నిలయంగా  ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యాణించినట్టు సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆ దిశగా ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో కలిసి ధరణిపై దాదాపు 2గంటల పాటు సమీక్షించారు.

Spread the love