నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు తెలుస్తోంది. తన కుమారుడు రోహిత్‌కి మెదక్ అసెంబ్లీ టిక్కెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్ పైన, మంత్రి హరీష్ రావుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం విధితమే. తనకు రెండు టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ లో చేరుతాననే మైనంపల్లి ప్రతిపాదనకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దాదపు అన్నిరకాల చర్చలు పూర్తి కావడంతో మైనంపల్లి హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్టు చేస్తోంది. ఈ సభలో మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ రెండు టిక్కెట్ల ఆఫర్
మల్కాజ్‌గిరి టికెట్ హన్మంతరావు, మెదక్ నుంచి రోహిత్‌కు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. ఆ హామీతోనే మైనంపల్లి హస్తం గూటికి చేరుతున్నట్టు అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మెదక్ టికెట్ ఇప్పటికే పద్మా దేవేందర్ రెడ్డికి ఖరారు కావడంతో… తన కుమారుడిని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలని మైనంపల్లి భావిస్తున్నారు. మెదక్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో వెంటనే చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.