నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో రేఖానాయక్ పీఏ దరఖాస్తు అందజేశారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బీఆర్ఎస్ ఖానాపూర్ టికెట్‌ను భూక్యా జాన్సన్‌కు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. త్వరలోనే రేఖా నాయక్ కూడా హస్తం గూటికి చేరే అవకాశముంది. ఈ సందర్భంగా ఖానాపూర్‌లో రేఖానాయక్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని చెప్పారు. తన జీవితం ప్రజలకే అంకితం చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎవరు మోసం చేసినా భగవంతుడు మోసం చేయడనే నమ్మకం తనకుందని చెప్పారు. ఖానాపూర్ నుంచి తాను పోటీలో ఉండటం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.