నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన మన్నెం అజయ్‌కుమార్ తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌లో 44వ ర్యాంకు సాధించారు. ఐఐటీ ధన్‌బాద్‌లో ఎంటెక్ పూర్తిచేసిన అజయ్‌కుమార్.. సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధం అవుతున్నారు. సివిల్స్ ప్రధాన పరీక్షలో రెండు మార్కులు తగ్గడంతో ముఖాముఖికి అర్హత సాధించలేకపోయారు. తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్‌లో మంచి ఫలితం రావడం సంతోషంగా ఉందని, ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. ఏపీ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తుమ్మల కృష్ణ చైతన్య ఐఎఫ్‌ఎస్‌లో 74వ ర్యాంకు సాధించారు. కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన ఆయన నాలుగో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. చిన్న చిన్న తప్పులతో సివిల్స్ 4 మార్కులతో చేజారినట్లు చెప్పారు. తనకు ఫారెస్ట్ సర్వీస్‌పైనే మక్కువని వివరించారు.