మళ్లీ అదే తీరు..

మళ్లీ అదే తీరు..– తెలంగాణకు ఏం చేస్తారో చెప్పని మోడీ..
– అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ఎద్దేవా
– దేశవ్యాప్తంగా రేవంత్‌, రాహుల్‌ ట్యాక్స్‌పైనే చర్చంటూ వ్యాఖ్య
– వేములవాడ రాజన్న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
– దక్షిణకాశీ వేములవాడకు కనీస హామీనివ్వని ప్రధాని
– శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై ఖండన
– వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌ సభల్లో ప్రధాని
నవతెలంగాణ – కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధులు / వరంగల్‌ / వేములవాడ / వేములవాడ రూరల్‌
రాష్ట్రంలో అవినీతికి కేరాఫ్‌గా మారిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలది ఫెవికాల్‌ బంధమని, ఇక్కడ సంపదంతా ఆర్‌ఆర్‌ (రేవంత్‌, రాహుల్‌) ట్యాక్స్‌ పేరుతో సగం హైదరాబాద్‌కు, మరోసగం ఢిల్లీకి చేరుతోందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. వర్ణ వివక్షను సహించేది లేదని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికలో కాంగ్రెస్‌ వర్ణ వివక్షతోనే వ్యతిరేకించిందని కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా జాతి వివక్షపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం లక్ష్మీపురంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌ అభ్యర్ధులు ఆరూరి రమేష్‌, అజ్మీరా సీతారాంనాయక్‌, బండి సంజరు గెలుపునకు నిర్వహించిన బహిరంగసభల్లో మోడీ ప్రసంగించారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ వెలిగిపోతోందని, ఒకప్పుడు రక్షణ రంగంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి ఎదిగామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సంస్కరణ వల్లే పేదవానికి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, పదేండ్ల ఎన్డీయే పాలనలో వ్యవసాయాన్ని ఆధునికీకరించి లాభసాటిగా మార్చామని, ఏకంగా డ్రోన్లను ప్రోత్సహించామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూనే మరోవైపు చేనేతలకు టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ స్థానాలు ఇవ్వాలని వేడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్‌ లక్ష కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే.. ఇప్పుడున్న కాంగ్రెస్‌ సర్కారు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో ప్రజల సంపదను దోచుకుంటోందని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ భౌతికకాయాన్ని కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అనుమతించకుండా కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. తమ ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించి గౌరవించిందని తెలిపారు. ఎస్సీలకు వ్యతిరేకంగా రిజర్వేషన్‌లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్‌ నేత అంటున్నారని, ఆ రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకమో ప్రజలు గమనించాలని కోరారు. ‘కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..’ ఈ నినాదంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పని చేస్తున్నాయని, ఆ రెండు పార్టీలూ నాణేనికి బొమ్మా బొరుసులాంటివి అని అన్నారు. ఓటుకు నోటు కేసుపై బీఆర్‌ఎస్‌ విచారణ చేయించకుండా, కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్‌ విచారణకు ఆదేశించకుండా ఒకరినొకరు కాపాడుకుంటున్నారని, ఇది వారిద్దరి ఫెవికాల్‌ బంధానికి అద్దం పడుతోందన్నారు. కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ల్లో బీజేపీ గెలుపు ఖాయమైందని, కాంగ్రెస్‌ అభ్యర్ధులు ఎవరో ప్రజలకు తెల్వదని, బీఆర్‌ఎస్‌ ప్రభావం మచ్చుకైనా కనిపించడం లేదని అన్నారు.
దక్షిణకాశీకి కనీస హామీనివ్వని ప్రధాని.. కనీసం కోరని ‘బండి’
ప్రచార సభకు హాజరయ్యే ముందే వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ప్రధాని మోడీ దర్శించు కుని కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభలో ‘దక్షిణ కాశీ భగవానుడికి ప్రణామాలు..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఈ ఆలయ ప్రతిష్ఠ గురించిగానీ, ఇక్కడి అభివృద్ధి గురించిగానీ ఒక్క మాటా మాట్లాడలేదు. కనీసం వారణాసిలా వేములవాడను అభివృద్ధి చేస్తామని ప్రధాని చెబుతారని ఆశించిన బీజేపీ శ్రేణులకు ఒక్క హామీ ఇవ్వకుండా నిరాశే మిగిల్చారు. ఇదే సమయంలో మరోమారు ఎంపీగా పోటీ చేస్తున్న బండి సంజరు సైతం తన ప్రసంగంలో అసాంతం మోడీని పొగడ్తలతో ముంచెత్తారే తప్ప కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గానికి కావాల్సిన ఒక్క వినతినీ మోడీ ముందు పెట్టలేదు. ఆద్యంతం ఈ ప్రచార సభ మోడీ పొగడ్తలు, విపక్షాలపై విమర్శలతోనే సాగడం గమనార్హం.
మోడీ ప్రసంగంపై జనం విముఖత
వరంగల్‌ జిల్లా లక్ష్మీపురం మైదానంలో జరిగిన బీజేపీ ‘ఓరుగల్లు జనజాతర’ సభకు ప్రధాని మోడీ ఉదయం 11:30 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 12:30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. దాంతో ఎండ వేడికి తట్టుకోలేక.. ప్రసంగం ప్రారంభించే దశలోనే జనాలు వెను తిరగడం మొదలుపెట్టారు. భానుడి ఉగ్రరూపంతో పాటు పసలేని మోడీ ప్రసంగం వినలేక ప్రజలు వెళ్లిపోయారు. దాంతో నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహం చెందారు. అంతేకాదు, సభా ప్రాంగణంలో ప్రజల కోసం ఏర్పాటుచేసిన మజ్జిగ ప్యాకెట్లు, తాగునీటి ప్యాకెట్లు వారికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనాన్ని సభాస్థలికి చేర్పించేంతవరకు బీజేపీ శ్రేణులు చూపెట్టిన ప్రత్యేక శ్రద్ధ, వారికి సదుపాయాలు కల్పించే విషయంలో పెట్టలేదని చర్చ సాగుతోంది.

Spread the love