కూలిన బతుకులు

Fallen survivors– భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు కార్మికులు మృతి
– మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో ఘటన
– మరో చోట నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు
నవవతెలంగాణ-సిటీబ్యూరో/దుండిగల్‌/ బేగంపేట్‌
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో కురిసిన కుండపోత వర్షానికి బాచుపల్లిలోని రేణకా ఎల్లమ్మ కాలనీలో ఓ భవన నిర్మాణ ప్రాంతంలో రిటెయినింగ్‌ వాల్‌ కూలి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నారు. వారంతా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలుగా అధికారులు గుర్తించారు. జేసీబీల సహాయంతో శిథిలాలు తొలగించి మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఘటనపై బిల్డర్‌, సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాలు ఇలా..
బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో గల సర్వే నెంబర్‌ 345, 406లో సుమారు 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హరిజన్‌ రిజ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ.. హెచ్‌ఎండీఏ అనుమతితో సెల్లార్‌, ప్లస్‌ 5 అప్పర్‌ ఫ్లోర్లతో రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తున్నది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన 15 కుటుంబాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. వారు ఆ ప్రదేశంలోనే రేకుల షెడ్స్‌ వేసుకుని నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భారీ వర్షానికి భవనం చుట్టూ నిర్మించిన రిటెయినింగ్‌ వాల్‌ కార్మికుల రేకుల షెడ్లపై కూలింది. కార్మికులు షెడ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొందరు అందులోనే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న బాచుపల్లి సీఐ ఉపేందర్‌ నేతృత్వంలో బృందం వెంటనే రంగంలోకి దిగింది. సిమెంటు మట్టి గడ్డలను తొలగించి కార్మికులను రక్షించేందుకు ప్రయత్నించింది. అయితే ఏడుగురు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణం కోల్పోయారు. గాయపడిన వారిని మమత హాస్పిటల్‌కు తరలించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు అధికారులు సహాయక చర్యల్లో పాల్గొని రిటెయినింగ్‌ వాల్‌ శిథిలాలను తొలగించారు. ఆ శిథిలాల కింద నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో తిరుపతి మాఝీ (20), శంకర్‌ (22), రాజు (25), రాజు భార్య ఖుషి(25), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4) ఉన్నారు.
నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు
బేగంపేటలోని నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇందుకు సంబంధించి బేగంపేట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.జయచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్‌లోని నాలాలో రెండు మృతదేహాలను బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయటకు తీయించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల వద్ద లభించిన ఆధారాల ప్రకారం వారు ఒడిశా ప్రాంతానికి చెందిన చంద్రపాండా(38), మనోజ్‌ దాస్‌(45)గా గుర్తించారు. వీరిద్దరు ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీలో ఓ గదిలో ఉంటూ.. అమీర్‌పేట్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఇరువురు విధులు ముగించుకుని ఓ వైన్‌ షాపులో మద్యం సేవించినట్టు తెలిసింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో భారీ వర్షంలో రైలు పట్టాలు దాటుతుండగా నాలాలో పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ప్రమాదవశాత్తు నాలాలో పడ్డారా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love