ఇకమూడ్రోజులే…

Three more days...– పోటాపోటీగా ఎన్నికల ప్రచారం.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
– 13న పోలింగ్‌కు సర్వం సిద్ధం
– ఫలితాల కోసం వేచి చూడాల్సిందే..
సార్వత్రిక పోరు చివరి ఘట్టానికి చేరుకున్నది. ఢిల్లీ పెద్దలు రెక్కలు కట్టుకుని తెలంగాణ గడ్డపై వాలి మరీ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటరన్నను ప్రసన్నం చేసుకోవటానికి వరాలజల్లులు కురిపిస్తున్నారు.ఈ సమరంలో గెలుపుపై ఎవరి ధీమా వారిదేనన్న తీరు కనిపిస్తోంది. ప్రచార సభలకు భారీగా తరలి వస్తున్నా.. అవి ఓట్లుగా మారుతాయా అనే ఆందోళన అన్ని పార్టీలనూ వెంటాడుతోంది.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం పీక్‌ స్టేజీకి చేరింది. మరో మూడ్రోజుల్లో పార్టీల ప్రచారం కూడా ముగియనుంది. ఈనెల 13న పోలింగ్‌ జరిగితే, ఫలితాలు జూన్‌ 4వ తేదీన వెల్లడవుతాయి. అంటే పోలింగ్‌ అయ్యాక, ఫలితాల కోసం 21 రోజుల పాటు సస్పెన్స్‌ను భరించాల్సిందే. రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని పోటీకి నిలిపాయి. సీపీఐ(ఎం) భువనగిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తుంది. అలాగే మజ్లిస్‌ పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మాత్రమే పోటీ చేస్తుంది. సీపీఐ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఐ(ఎం) కూడా భువనగిరి మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి ఆ సంఖ్యను పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ ఇప్పుడున్న స్థానాలను నిలుపుకోవడం కూడా కష్టంగా మారినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు పూర్తిగా ముక్కోణపోటీలో రుగుతున్నాయి. మెజారిటీ సీట్ల సాధనపై కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలుచోట్ల అభ్యర్థుల గెలుపును ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులకు అప్పగించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా అన్ని లోక్‌సభ స్థానాలను చుట్టివస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ ఎన్నికల ప్రచారం పూర్తిగా ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా, ఆపార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాల పర్యవేక్షణలో జరుగుతున్నది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్‌ దాదాపు ప్రచారానికి దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అడపాదడపా హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మాత్రమే ఆయన తూతూ మంత్రంగా తిరుగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే గతంలో లక్ష్మణ్‌ ప్రాతినిధ్యం వహించిన ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కనీసం అక్కడ కూడా కిషన్‌రెడ్డి కోసం ప్రచారం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ ఎన్నికల్లో వెల్లడవుతున్నదని ఆపార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌పార్టీ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ కూడా అదే లక్ష్యాన్నిపైకి ప్రకటించినా, ఆపార్టీకి క్షేత్రస్థాయిలో నాయకత్వం, కార్యకర్తలు లేకపోవడంతో అవరోధంగా మారింది. ఇక బీఆర్‌ఎస్‌ కూడా ఇదే లక్ష్యాన్ని పెట్టుకొని ప్రచారం చేస్తుంది. అయితే త్రిముఖ పోటీలో బీఆర్‌ఎస్‌ మూడోస్థానానికి పడిపోయి, బీజేపీకి మేలు జరుగుతుందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈనెల 11వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీలు ఈలోపు ఓటర్లను ఆకట్టుకొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పోలింగ్‌కు ముందు రోజైన 12వ తేదీ కీలకంగా మారనుంది. ఆరోజే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయపార్టీలు అందివచ్చిన అవకాశాలన్నింటినీ వాడుకోవాలని భావిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్వాధీనం చేసుకున్న సొమ్ము, ఉచితాలు, తాయిలాలతో పోలిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో కూడా ఎన్నికలతో సంబంధం లేని సాధారణ ప్రజల నుంచి తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ము, ఆభరణాలే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లకు పంచేందుకు అవసరమైన సొమ్మును ప్రధాన రాజకీయపార్టీలు ముందుగానే బూత్‌ స్థాయిలో ఆయా బస్తీల్లోకి చేర్చేశాయనే ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి ఓటర్లకు చేరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మరింత పటిష్టమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు 13వ తేదీన జరిగే పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. కేంద్ర బలగాల పహారాల్లో ఎన్నికల ఫెలిసిటేషన్‌ సెంటర్లు ఉన్నాయి. ఈవీఎంల తనిఖీలు పూర్తయ్యాయి. ఈనెల 11వ తేదీ ఆయా రాజకీయపార్టీల ఏజెంట్ల సమక్షంలో మరోసారి ఈవీఎంలను పరిశీలించనున్నారు. రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!

Spread the love