కమలం ఎజెండాలో పేదల సంక్షేమమేది?

Kamalam is on the agenda What is the welfare of the poor?– అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌
– ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలే
– ఈ వయస్సులో ఏం సాధిస్తానని మదన్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లాడు
– వెంకట్రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయం: గజ్వేల్‌, నర్సాపూర్‌, దుండిగల్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-నర్సాపూర్‌/దుండిగల్‌
”అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.. మరోవైపు కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ఎజెండాలో పేదల సంక్షేమమే లేదు..” అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అభివాదం చేస్తూ వెళ్లి.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీనీ అమలు పరచలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు, తాగునీరు సమస్యలు తలెత్తాయని చెప్పారు. మల్లన్న సాగర్‌ నుంచి రైతులకు సాగునీరు అందించే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేలా లేదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి పైసా లాభం చేకూర్చలేదని, ఆయన ఎజెండాలో పేదల సంక్షేమమే లేదని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల ను చంపిన ఘనత నరేంద్ర మోడీకే దక్కిందన్నారు. యూపీ ఎన్నికలు వచ్చేసరికే రైతులకు సారీ చెప్పి.. మాఫీ చెప్పి వేడుకున్న వ్యక్తి మోడీ అని ఎద్దేశా చేశారు. ఏ ప్రధానమంత్రి కాలంలో దేశం దిగజారనంతగా దిగజారిపోయిందన్నారు. పదేండ్ల మోడీ పాలనలో ఎవరికి ఎలాంటి ఉపయోగమూ జరగలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం హల్దీ వాగుపై, మంజీరా నదిపై పది చెక్‌ డ్యాములు నిర్మించానన్నారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ డబ్బులను ఇవ్వకుండా తిరిగి తీసుకుందని విమర్శించారు. సమాజంలో ఏ ఒక్క వర్గం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. అందరూ ఏకమై తెలంగాణను కాపాడుకోవాలన్నారు. తమ హయాంలో అందరికీ రైతుబంధు ఇచ్చామని, ఇప్పుడు వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని నర్సాపూర్‌ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేను చేశానని, ముసలితనానికి కుసుమ గుడాలు అన్నట్టుగా 70 ఏండ్ల వయసులో ఏమి సాధిస్తానని మదన్‌ రెడ్డి కాంగ్రెసులోకి వెళ్లాడో చెప్పాలన్నారు. తన సర్వే ప్రకారం మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ మాజీ చైర్మెన్‌ దేవేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ అశోక్‌ గౌడ్‌, వైస్‌ చైర్మెన్‌ నహిముద్దీన్‌, జెడ్పీటీసీలు పబ్బ మహేష్‌గుప్తా, బభ్యానాయక్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ చంద్రగౌడ్‌, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, నాయకులు చంద్రశేఖర్‌, రమణ గౌడ్‌, సత్యం గౌడ్‌, భిక్షపతి, సూరారం నరసింహులు పాల్గొన్నారు.హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దిగజారుస్తోంది..: మల్కాజిగిరిలో కేసీఆర్‌హైదరాబాద్‌ నగర బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగజారుస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని దుండిగల్‌ రోడ్‌షోలో ప్రసంగించారు. బీజేపీని గెలిపిస్తే విదేశాల్లోని నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికీ రూ.15లక్షలు ఇస్తామని మోడీ అన్నారని, ఎవరికైనా వచ్చాయా అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసుకునే మోడీ.. విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జంట నగరాలను పవర్‌ ఐలాండ్‌గా మార్చానని, న్యూయార్క్‌లో, లండన్‌లో కరెంటు పోయినా.. హైదరాబాద్‌లో కరెంటు పోకుండా చేశానని అన్నారు. ఇప్పుడు కొద్దిపాటి వాన పడితే ఆరు, ఎనిమిది, పది గంటలు కరెంటు పోతున్నదన్నారు.
పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ వారు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారని,. తెలంగాణకు నిధులు తెస్తారని అన్నారు.

Spread the love