– ఆ సీట్లు కచ్చితంగా గెలవాల్సిందే… : చేవెళ్ల, వరంగల్, పెద్దపల్లి, సికింద్రాబాద్ స్థానాలపై కేసీఆర్ నజర్
– రంజిత్‌రెడ్డి, కడియం, దానం నాగేందర్‌ను వదలొద్దంటూ ఆదేశాలు
– చేవెళ్ల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘పదవి లేకపోతే.. సీటివ్వకపోతే ఓకే…కానీ అన్ని రకాలుగా అనుభవించి, పార్టీకి ద్రోహం చేసి, నన్ను మోసం చేసి పోయిన ఆ ముగ్గురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు.. కచ్చితంగా ఓడించి తీరాలె…’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ఎంపీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత… పార్టీ మారి ‘హ్యాండిచ్చిన’ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఉద్దేశించి ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి గులాబీ పార్టీకి వెన్నంటి ఉన్న ఉద్యమకారులు, సీనియర్లను కాదని, ఆ ముగ్గురిని అక్కున చేర్చుకుని అందలమెక్కిస్తే…చివరకు నమ్మించి నట్టేట ముంచారంటూ ఆయన వాపోయారు. అందువల్ల చేవెళ్లలో రంజిత్‌రెడ్డిని, సికింద్రాబాద్‌లో దానంను, వరంగల్‌లో కడియంను (కాంగ్రెస్ నుంచి టిక్కెట్ వచ్చే అవకాశముంది) కచ్చితంగా ఓడించి తీరాలనీ, ఇందుకోసం శాయశక్తులా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న తరుణంలో… ఇటీవల ముఖ్య నేతలు, తనకు అత్యంత సన్నిహితులైన నాయకులతో కేసీఆర్ అంతర్గత సమావేశాన్ని నిర్వహించారని సమాచారం. ఈ సందర్భంగా ఆయన తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి తదితరులు పార్టీ మారటానికి గల కారణాలపై ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ సీటు గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘సిట్టింగైన పసునూరి దయాకర్‌ను పక్కనబెట్టాం. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి పోయారు. సీనియర్ అయిన ఆరూరి రమేశ్‌కు మనం టిక్కెట్ ఇవ్వకపోవటంతో ఆయన బీజేపీ కండువా కప్పుకుని, ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. కడియం శ్రీహరి కోసం వీరిద్దరినీ వదులుకుని, ఆయన కుమార్తెకు టిక్కెటిస్తే, ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా మనల్ని మోసం చేశారు…’ అంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని రంజిత్‌రెడ్డికి టిక్కెటిచ్చి, చేవెళ్ల ఎంపీని చేస్తే ఆయన కూడా ఇప్పుడు మోసం చేశారని వాపోయారు. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో మొదట అభ్యర్థిని ప్రకటించింది చేవెళ్లేనని ఆయన గుర్తు చేశారు.మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపైనా కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వినికిడి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి, కేసీఆర్ ప్రగతి భవన్‌ను వీడిన తర్వాత, ఆయన ఎక్కడుండాలనే చర్చ జరిగినప్పుడు…’నాకు జూబ్లీహిల్స్‌లో పెద్ద ఇల్లు ఉంది, మీరు నా తండ్రి లాంటి వారు, మీరు నా ఇంట్లో ఉండొచ్చు…’ అంటూ ప్రకటించిన దానం…బీఆర్‌ఎస్‌లో గెలిచి, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేస్తూ పార్టీని ఆగం పట్టించాడంటూ కారు పార్టీ అధినేత అసహనాన్ని వ్యక్తం చేసినట్టు వినికిడి. వీరితోపాటు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత… తనకు టిక్కెట్ రాదని తెలిసి, కాంగ్రెస్‌లోకి జంప్ అవటం పట్ల కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందువల్ల ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు, మోసం చేసిన వారి పని పట్టేందుకు గట్టి కృషి చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
కాసాని గెలుపు ఖాయం…
చేవెళ్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు ఖాయమని కేసీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 13న చేవెళ్లలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు లక్ష మంది దాకా సమీకరించాలని ఆయన పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆ సభను విజయవంతం చేయటం ద్వారా కాసాని గెలుపు సంకేతాలివ్వాలంటూ నేతలకు సూచించారు.