అన్ని వర్గాలకు ప్రగతి ఫలాలు

– గోల్కొండ కోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌
– లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పంపిణీకి శ్రీకారం
– త్వరలో కొత్త పీఆర్సీ..అప్పటిదాకా మధ్యంతర భృతి
– పూర్ణ కలశం వలె ఇరవైకిపైగా రిజర్వాయర్లు
– దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణలా విలసిల్లుతున్న రాష్ట్రం
– ఐదు కీలకాంశాల్లో తెలంగాణదే అగ్రస్థానం
– ప్రగతిఫలాలు అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డప్పుడే స్వాతంత్య్రానికి సార్ధకత
‘హైదరాబాద్‌ మహానగరంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రభుత్వం నేటి నుంచే అర్హులైన పేదలకు అందజేస్తుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతంలో రూ.12 వేల కోట్లు ఉన్న సింగరేణి టర్నోవర్‌ను రూ.33 వేల కోట్లకు తమ ప్రభుత్వం పెంచిందనీ, సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్‌గా వెయ్యి కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతు న్నట్టు వెల్లడించారు. ప్రగతిఫలాలు అన్ని వర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్య్రానికి సార్థకత చేకూరుతుందని నొక్కి చెప్పారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ఉన్నతమైన వైద్యారోగ్య ప్రమా ణాలు, ఉత్తమ విద్యా ప్రమాణాల వంటి ఐదు కీలకాంశాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పూర్ణ కలశం వలె ఇరవైకిపైగా రిజర్వాయర్లు కళకళలాడుతు న్నాయనీ, దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణలా రాష్ట్రం విలసిల్లుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతు సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా నిర్వహిస్తున్నదనీ, దీంతో రాష్ట్రం వికాస పథంవైపు దూసుకెళ్తున్నదని చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్‌ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్‌, జీఏడీ కార్యదర్శి వి.శేషాద్రి, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ అర్విందర్‌ సింగ్‌, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, అడిషనల్‌ డీజీపీ
స్వాతిలక్రా, తదితర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు పాల్గొన్నారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం సికింద్రాబాద్‌ పెరేడ్‌గ్రౌండ్‌లోని అమర సైనికుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడ బుక్‌లో సంతకం చేశారు. ఆ తర్వాత గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఆయా సామాజిక తరగతులకు, మైనార్టీలకు, దళితులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పించి రైతుబంధు, పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నామన్నారు. పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి వారిని విముక్తులను చేశామని తెలిపారు. ఆర్టీసీ సంస్థను కాపాడాలనే ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కొన్ని సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయనీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రత పెరిగాయనీ, రాష్ట్రపతి చేతుల మీదుగా 13 జాతీయ అవార్డులను మన స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. టీఎస్‌ఐపాస్‌ చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదనీ, రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మరింత విస్తరించిందని చెప్పారు. ఆ రంగంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయన్నారు. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57, 258 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.2, 41, 275 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు.
తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో మనమే ఫస్ట్‌
పెద్దరాష్ట్రాలను అధిగమించి రూ.3,12,398 తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ తలసరి విద్యుత్‌ వినియోగం 1,255 యూనిట్లుగా కాగా తెలంగాణలో 2,126 యూనిట్లుగా ఉందని వివరించారు. ఈ విషయంలోనూ మనమే నెంబర్‌వన్‌గా ఉన్నామని చెప్పారు. అన్ని రంగాలకూ 24 గంటల కరెంటు, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. 21వైద్య కళాశాలను ప్రారంభించామనీ, మరో ఎనిమిదింటికి ఆమోద ముద్ర వేశామని తెలిపారు.
తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు
గత నెలలో కురిసిన అసాధారణ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తక్షణ సహాయ చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ సత్వర చర్యల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను చాలా వరకు నివారించగలిగామన్నారు. అకాల వర్షాల వల్ల ఇండ్లు దెబ్బతిన్న వారికి గృహలక్ష్మి కింద సహాయం అందిస్తున్నామని చెప్పారు. కోతకు గురైన పంట పొలాల సంఖ్యను అంచనా వేస్తున్నామని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వర్షాల బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా బాసటగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
ఈ స్థాయిలో ఏ రాష్ట్రమూ రుణమాఫీ చేయలేదు
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు రూ.37 వేల కోట్ల మేర పంట రుణాలను మాఫీ చేసిందనీ, దేశం మొత్తంమీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని కేసీఆర్‌ చెప్పారు. ఉచిత విద్యుత్‌, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించామని వివరించారు. దీంతో ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరిందన్నారు. ప్రథమ స్థానం కోసం పంజాబ్‌తో పోటీపడుతున్నామని చెప్పారు. రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమంపై వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శిం చారు. వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్‌ సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నవారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై న్యాయమే గెలిచింది
12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు 1200 గ్రామాలకు తాగునీరందించే అమృతప్రాయమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్‌ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టు కున్నారని సీఎం విమర్శించారు. విద్రోహ మనస్తత్వం తో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయనీ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయపోరాటం గెలిచిందని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. అవరోధం తొలగింది కాబట్టి సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.
నిర్విరామ ప్రక్రియగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, గృహలక్ష్మి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్విరామ ప్రక్రియగా కొనసాగిస్తుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం నుంచే హైదరాబాద్‌లోని లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పేదలకు అందజేస్తామన్నారు. స్థలముండి ఇల్లు నిర్మించుకోలేని వారి కోసం మూడు దశల్లో మూడు లక్షల రూపాయలను అందజేస్తామని తెలిపారు. తొలుత ప్రతి నియోజకవర్గంలోనూ మూడు వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుతుందనీ, వికలాంగులకు అందులో ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించామని వివరించారు.
అనాథల పిల్లలకు అండదండలు
అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. వారిని ”స్టేట్‌ చిల్డ్రన్‌” గా పేర్కొంటూ ఉన్నత, ఉదాత్తమైన పద్ధతిలో ఓర్పాన్‌ పాలసీని రూపొందించామన్నారు. అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, వారికి విద్యాబుద్ధు లు నేర్పించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవ రకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పారు.
త్వరలో కొత్త పీఆర్సీ…అప్పటిదాకా మధ్యంతర భృతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలోనూ ముందు వరుసలో ఉన్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేనని చెప్పారు. కరోనా సమయంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌ మెంట్‌ని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి సైతం వేతనాల పెంపును వర్తింపజేశామన్నారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామనీ, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వీఆర్‌ఏలకు పేస్కేలు వర్తింపజేస్తూ క్రమబద్ధీకరించామనీ, ఆయా శాఖల్లో వారిని అజ్జెస్ట్‌ చేస్తున్నామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులనూ క్రమబద్ధీకరించామన్నారు.
హైదరాబాద్‌ నలుమూలలకు మెట్రో
హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించి, సిగల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67, 149 కోట్లతో స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాం ను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ లు, ఆర్వోబీలను అభివృద్ధి చేస్తున్నామ న్నారు. 275 కోట్ల రూపాయలతో 22 లింక్‌ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశామన్నారు. రూ.69 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయపరచి 415 కిలోమీటర్ల మేర ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ నేరుగా ఎయిర్‌ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించే ందుకు ప్రణాళిక రూపొదించామని వివరించారు.
రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం
”సంపద పెంచు – ప్రజలకు పంచు” అనే సదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో పేదరికం తగ్గిందని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్నదనీ, తలసరి ఆదాయం పెరుగుతున్నదని నిటిఅయోగ్‌ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

Spread the love