పాత పాటే…

– ప్రతిపక్షాలపైవిమర్శలకే వేదికైన ఎర్రకోట
– ఎన్నికల ప్రచారంగా ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
– 90 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ఆత్మస్తుతి, పరనింద...
మహిళలు లక్షాధికారులుగా..
మహిళా స్వయం సహాయక బృందాల కృషిని మోడీ ప్రశంసించారు. రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలనేది తన కల అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల్లో నేడు 10 కోట్ల మంది మహిళలున్నారని తెలిపారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పౌర విమానయాన రంగంలో మహిళా పైలట్లు ఉన్నారని, మహిళలు శాస్త్రవేత్తలు అవుతు న్నారని చెప్పడం గర్వంగా ఉందన్నారు. చంద్రయాన్‌ కార్యక్రమానికి మహిళా శాస్త్ర వేత్తలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాన్ని జీ20 దేశాలు గుర్తించాయన్నారు.
న్యూఢిల్లీ : అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు వ్యతిరేకంగా పోరాటమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాత పాటే పాడారు. ఎర్రకోట వేదికగా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. 90 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం ఎన్నికల ప్రచారాన్నే తలపించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం నాడిక్కడ ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మువ్వెన్నల జెండాను ఎగురువేశారు. వరుసగా పదోసారి ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చ డానికి ‘పారదర్శకత, నిష్పాక్షికత’ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు దేశాన్ని వెనుకకు లాగుతున్న ‘వ్యాధులు’ అన్నారు. వారసత్వ రాజకీయాలను అంతం చేస్తానని చెప్పారు. పేదరికం తగ్గితే, మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుందని చెప్పారు. రానున్న ఐదేండ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా దేశం నిలుస్తుందన్నారు. ఇది మోడీ ఇచ్చే గ్యారంటీ అని తెలిపారు. 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారని, వారంతా మధ్య తరగతికి బలంగా మారారని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అనువదించడాన్ని ప్రధాని మోడీ కొనియాడారు.
యువతకు మెరుగైన భవిత
దేశంలో యువతకు మెరుగైన భవితను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అవకాశాలకు కొరత లేదన్నారు. అంతులేని అవకాశాలను అందించే సమర్థత దేశానికి ఉందన్నారు. యువత శక్తి, సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందన్నారు. మన యువత ప్రపంచంలో మొదటి మూడు స్టార్టప్‌ ఇకోసిస్టమ్స్‌లో ఒకదానిగా దేశాన్ని తీసుకెళ్లిందని తెలిపారు. మన దేశ సైనిక దళాలు నూతన జవసత్త్వాలతో, యుద్ధ సన్నద్ధతతో ఉండేలా నిరంతరం సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసమే..
ప్రభుత్వానికి ఉన్న ప్రతి క్షణం, ప్రతి రూపాయి దేశ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు ఐకమత్యంగా ఉన్నందువల్ల మనం బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నామని, లీకేజీలను అరికట్టగలిగామని చెప్పారు. సంక్షేమ పథకాలను పొందుతున్న 10 కోట్ల మంది బూటకపు లబ్ధిదారులను తొలగించినట్లు తెలిపారు. అక్రమాస్తుల జప్తు 20 రెట్లు పెరిగిందన్నారు. డిప్‌ సి మిషన్‌, రైల్వేల ఆధునీకరణ, వందే భారత్‌ రైలు, బుల్లెట్‌ రైలు… ఇలాంటివాటి కోసం మనం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయంపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు.
మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. గత కొన్ని వారాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మణిపూర్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశ ఆడబిడ్డల గౌరవ, మర్యాదలకు తీవ్ర భంగం కలిగిందని అన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అక్కడ ప్రశాంతత ఏర్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. యావద్భారతావని మణిపూర్‌ రాష్ట్రానికి, ప్రజలకు అండగా ఉందని తెలిపారు.లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ ప్రజలకు ముఖ్యమైన హామీలు ఇచ్చారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి వృత్తి నైపుణ్యంగల యువత కోసం ప్రత్యేక పథకాలు వంటివాటిని ప్రకటించారు.
విశ్వకర్మ పథకం
వచ్చే నెల నుంచి విశ్వకర్మ పథకాన్ని రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభిస్తామని మోడీ తెలిపారు. క్షురక వృత్తి, బట్టలు ఉతకడం, బంగారు ఆభరణాలు తయారు చేయడం వంటి సంప్రదాయ నైపుణ్యాలుగలవారికి ఈ పథకం క్రింద లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
చౌక ధరకు మందులు
జన ఔషధి కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని తన ప్రభుత్వం ప్రణాళిక రచించిందని చెప్పారు. జనరిక్‌ మందులు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. మధుమేహ రోగగ్రస్థులు నెలకు రూ.3,000 వరకు ఖర్చు చేయవలసి వస్తోందని, రూ.100 విలువైన మందులు జన ఔషధి కేంద్రాల్లో రూ.10 నుంచి రూ.15కే అందుబాటులో ఉంటాయని చెప్పారు.
సొంతింటి కల
పట్టణాలు, నగరాల్లో తమకు ఓ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటున్నవారి కోసం తన ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెడుతోందన్నారు. నగరాల్లో నివసిస్తూ, సొంత ఇల్లు లేని మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు రుణాల్లో ఉపశమనం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ధరాభారం పడకుండా..
ద్రవ్యోల్బణం పెరుగుతున్నందు వల్ల ప్రజలపై ధరల భారం అతి తక్కువగా ఉండేలా చూడటం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంలో తన ప్రభుత్వం కొంత వరకు విజయం సాధించిందని చెప్పారు.
తొలిత ప్రధాని మోడీకి ఎర్రకోట వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి అజరు భట్‌, కార్యదర్శి గిరిధర్‌ అరమానే తదితరులు స్వాగతం పలికారు. ఢిల్లీ సంయుక్త ఇంటర్‌-సర్వీసెస్‌, ఢిల్లీ పోలీస్‌ గార్డ్‌ బలగాలు ప్రధానికి వందన సమర్పణ చేశాయి. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఆహ్వానం పంపారు. ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందికి పైగా హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం, ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది, కొత్త పార్లమెంట్‌ భవనం, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవరాల తవ్వకం, ఇంటింటికీ నీరు పథకంలో పాల్గొన్న కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఖర్గే కుర్చీ ఖాళీగా దర్శనం
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనలేదు. ఈ సభలో ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. అయితే ఆయన ఓ రికార్డెడ్‌ మెసేజ్‌ని పంపించారు. గత కాలపు ప్రధాన మంత్రులు పోషించిన పాత్రను వివరిస్తూ, ప్రస్తుత ప్రధాని మోడీ ప్రతిపక్షాలను వెంటాడుతున్నారని దుయ్యబట్టారు. ఖర్గే కాంగ్రెస్‌ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. ఆయన కాంగ్రెస్‌ అధ్యక్ష హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ గత కాలపు ప్రధాన మంత్రులు దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. తొలి ప్రధాని నెహ్రూ, ఆ తరువాత వచ్చిన ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, రాజీవ్‌ గాంధీ, పివి నరసింహా రావు, మన్మోహన్‌ సింగ్‌ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ నేత అయిన అటల్‌ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా పోషించిన పాత్రను కూడా ప్రస్తావించారు. ప్రతి ప్రధాన మంత్రి ఈ దేశ ప్రగతి కోసం పాటుపడ్డారన్నారు. నేడు కొందరు వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల్లో మాత్రమే అభివృద్ధి చెందినట్టు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పడం తనకు చాలా బాధగా ఉందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం కొత్త కొత్త సాధనాలను వాడుతున్నారన్నారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు మాత్రమే కాకుండా ఎన్నికల కమిషన్‌ను కూడా బలహీనపరిచారన్నారు. ప్రతిపక్ష ఎంపీలపై దౌర్జన్యం చేస్తున్నారని, సస్పెండ్‌ చేస్తున్నారని, మైకులను పనిచేయనివ్వడం లేదని, ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌, అంతరిక్ష, అణు పరిశోధన సంస్థలు వంటివాటిని గతంలో ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాన్ని మరుగుపరుస్తోందని విమర్శించారు.

Spread the love