మౌనం వెనుక..

– ఏం చేసినా రాజకీయ లబ్ది కోసమే మత విభజన చిచ్చు పెట్టి
చలి కాచుకునే ప్రయత్నం
ప్రధాని నరేంద్ర మోడీ తన మౌనాన్నే శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్ని విమర్శనాస్త్రాలు సంధించినా ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. మణిపూర్‌లో జాతుల మధ్య రగిలిన పోరును, ఆ తర్వాత నూహ్, పల్వాల్‌, గురుగ్రామ్‌లో తలెత్తిన మత ఘర్షణలను ప్రతిపక్షాలు పదే పదే ప్రస్తావించినా ఆయన ఉలకలేదు…పలకలేదు. రెండు గంటల పాటు ప్రసంగించినప్పటికీ ఇండియా కూటమి సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకూ ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా వారి పైనే ఎదురు దాడి చేశారు. ఆయన ప్రసంగం ఎన్నికల ప్రచారాన్నే తలపించింది.
న్యూఢిల్లీ : మూడు నెలలుగా మణిపూర్‌లో పౌర యుద్ధం జరుగుతోంది. రాష్ట్రం రెండుగా చీలిపోయింది.అయినప్పటికీ మోడీ మౌనాన్ని వీడడం లేదు. శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను పల్లెత్తు మాట అన లేదు. ప్రధాని మౌనాన్ని భగం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు అవిశ్వాస బాణాన్ని ప్రయోగించాయి. అయినా తన రెండు గంటల ప్రసంగంలో మోడీ మణిపూర్‌ గురించి మాట్లాడింది కేవలం రెండు నిమిషాలు మాత్రమే.
విరుగుడు మందు అదేనా?
లోక్‌సభలో తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎలాగూ వీగిపోతుందని మోడీకి తెలుసు. దానిని గురించి ఆయనకు చింతే లేదు. ప్రతిపక్ష కూటమి రోజు రోజుకూ బలపడడం మాత్రం ఆయన్ని బాగా కలవరపెడుతోంది. 2024 ఎన్నికలలో బీజేపీని ఎలాగైనా మట్టి కరిపించాలని ప్రతిపక్షాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు ప్రధాని ఇప్పుడు విరుగుడు మందును కనిపెట్టే పనిలో పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో గుజరాత్‌లో ఏం జరిగిందో గుర్తుందా? ముస్లింలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులలో విష బీజాలు నాటారు. ఫలితంగా మెజారిటీ హిందూ ఓట్లను కొల్లగొట్టారు. ఇప్పుడు కూడా మణిపూర్‌ హింసను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నాలుగు మౌనం వెనుక ? సంవత్సరాల క్రితం పుల్వామా ఉగ్ర దాడి బీజేపీ విజయానికి ఎలా దోహదపడిందో తెలుసు కదా. ఇప్పుడు మణిపూర్‌ హింస కూడా అదే విధం గా తమపై ఓట్ల వర్షం కురిపిస్తుందని ప్రధాని విశ్వాసం. నూV్‌ా, గురు గ్రామ్‌లో జరిగిన మత ఘర్షణలు కూడా ఈ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది.
నీరో చక్రవర్తిలా…
మణిపూర్‌ హింసపై ప్రధాని మౌనం మతో న్మాదులకు ఊతమిచ్చింది. గో సంరక్షకులుగా చెప్పు కుంటున్న వారు ముస్లింలు, దళితులపై విచక్షణా రహితంగా దాడులు చేసి యాభై మందిని పొట్టన పెట్టుకున్నారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌ తగలబడిపోతుంటే…రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవరి ఫిడేలు వాయిస్తూ కూర్చున్న చందంగా పాలకులు నిర్వికారం గా చూస్తూ ఉండిపోయారు. నూV్‌ా, గురుగ్రామ్‌, పల్వాల్‌ ప్రాంతాలలో చెలరేగిన మత హింస విషయంలోనూ ప్రధాని ఉద్దేశపూర్వకంగానే మౌనం వహించారు. నూV్‌ా హింసకు ముస్లిం యువకుడే కారణమంటూ హర్యానా హోం మంత్రి చేసిన ఆరోపణపై కూడా స్పందించలేదు. తద్వారా ఆయన వ్యాఖ్యను పరోక్షంగా సమర్ధించారు. బీహార్‌లో ముస్లింలు ప్రశాంత జీవనం గడుపుతుంటే వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ సంస్థలు వారిపై కవ్వింపు చర్యలకు దిగాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దేశంలోని ఏ ప్రాంతంలో మత ఘర్షణలు జరిగినా మోడీ మౌనంగానే ఉండిపోతున్నారు తప్పించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మరోవైపు బీజేపీ, దాని అనుబంధ సంస్థల నాయకులు మాత్రం హిందువులు, మైనారిటీల మధ్య నిప్పు రాజేసి, దానితో చలి కాచుకొని, రాబోయే లోక్‌సభ ఎన్నికలలో మతపరమైన ఉద్వేగాలను ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాయి. ఉదాహరణకు హర్యానాలో ముస్లింల ఆస్తుల విధ్వంసం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత ఈ నెల 9న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ ధన్‌కర్‌ ఓ ప్రకటన చేస్తూ అల్లర్లకు కాంగ్రెస్‌, అమ్‌ఆద్మీ పార్టీలే కారణమని నిందించారు. నూహ్ లో పర్యటించకుండానే ఆయన, ఆయన బృందం ఈ నిర్ణయానికి వచ్చేసింది. నూV్‌ాలో పరిస్థితులను చూసేందుకు బయలుదేరిన కాంగ్రెస్‌ బృందాన్ని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. ఆప్‌ నేతలకు కూడా ఇదే అనుభవం ఎదురైంది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల వరకూ ఇలా ఉన్మాద ధోరణులు ప్రబలుతూనే ఉంటాయి. ఒకవేళ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే కొందరు ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నట్లు ఇవే మన దేశానికి చిట్టచివరి ఎన్నికలు అవుతాయేమో!
అబద్ధాలు..అసత్యాలే..
ఈశాన్యంపై అర్ధ సత్యాలతో కడుపు నింపిన మోడీ
మణిపూర్‌లో బంద్‌లు, రాస్తారోకోలు లేనే లేవట

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిస్తూ ఈశాన్య రాష్ట్రాల గురించి, తన హయాంలో అవి సాధించిన ప్రగతి గురించి పదే పదే ప్రస్తావించారు. మణిపూర్‌లో బంద్‌లు, రాస్తారోకోలు గత జ్ఞాపకాలని, ఇప్పుడు ఆ ప్రాంతంలో అంతా సజావుగానే ఉన్నదని ఆయన చెప్పుకొచ్చారు. తన హయాంలోనే తొలిసారిగా అగర్తలకు ఇతర ప్రాంతాలతో రైల్వే కనెక్టివిటీ జరిగిందని గొప్పలు పోయారు. ఈశాన్య ప్రాంతంలో ఎయిమ్స్‌ వంటి సంస్థలు ఏర్పడడం కూడా తన పాలన సాధించిన ఘనతేనని తెలిపారు. అంతేకాదు… మిజోరంలో ఆల్‌ ఇండియా మాస్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌, మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం ప్రారంభం కావడం కూడా తన పుణ్యమేనని అన్నారు. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలలో తమ ప్రభుత్వ హయాంలో సాధించిన అనేక ఘనకార్యాలను ఏకరువు పెట్టారు. అయితే లోక్‌సభ సాక్షిగా మోడీ చెప్పిన విషయాలలో వాస్తవమెంత అనే విషయాన్ని పరిశీలిస్తే అవన్నీ అబద్ధాలు, అర్థ సత్యాలతో నిండినవేనని అర్థమవుతుంది.
రైల్వే కనెక్టివిటీపై అసత్యాలు
ఈశాన్య రైల్వే వెబ్‌సైట్‌ ప్రకారం త్రిపురలో 1964లోనే మొట్టమొదటి రైల్వే లైన్‌ నిర్మాణం జరిగింది. దానిని 1990 నాటికి కామర్‌ఘాట్‌ రైల్వే స్టేషన్‌కు పొడిగించారు. అయితే త్రిపుర రాజధాని అయిన అగర్తలకు ఇప్పటి వరకూ రైలు సౌకర్యం లేదు. 2008లో ముందుగా మీటర్‌గేజ్‌ ద్వారా అగర్తలకు రైల్వే కనెక్టివిటీ కల్పించారు. ఆ సంవత్సరంలో లంబ్డింగ్‌ నుండి అగర్తల వరకూ మీటర్‌గేజ్‌ మార్గంలో మొట్టమొదటి రైలును నడిపారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల రైల్వే మ్యాప్‌లో చోటు దక్కిన రెండో రాజధానిగా అగర్తల రికార్డులోకి ఎక్కింది. అంతకుముందే అస్సాం రాజధాని గౌహతికి రైలు సౌకర్యాన్ని కల్పించారు. అగర్తల వరకూ పట్టాలు నిర్మించే పని ఇప్పటికీ సవాలుగానే ఉండిపోయింది. ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుండడం, కొండ ప్రాంతం కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో 109 కిలోమీటర్ల రైల్వే లైనును నిర్మించడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది.
బీబీసీ నివేదిక ప్రకారం ట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా 28 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడులలో ట్రాక్‌ కార్మికులు, గార్డులు సహా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు… 67 మంది అపహ రణకు గురయ్యారు. ఉగ్రవాదులు కోరినంత డబ్బు చెల్లించి కేవలం 19 మంది మాత్రమే వారి చెర నుండి బయట పడ్డారు. మిగిలిన వారి జాడ గురించి సమాచారమే లేదు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 2016లో అగర్తలను బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైనుతో అనుసంధానం చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అగర్తలకు 2008లో రైల్వే మ్యాప్‌లో చోటు దక్కింది. రైలు సర్వీసు ప్రారంభమైంది. 2016లో… అంటే నరేంద్ర మోడీ హయాంలో మాత్రం మీటర్‌ గేజ్‌ మార్గాన్ని బ్రాడ్‌ గేజ్‌ మార్గంగా మార్చారు. అంతే. తన పాలనలోనే అగర్తలకు మొట్టమొదటి సారిగా రైల్వే కనెక్టివిటీ ఏర్పడిందన్న మోడీ వాదన ప్రజలను తప్పుదోవ పట్టించ డానికి ఉద్దేశించిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మిజోరంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ను 2011 ఆగస్ట్‌ 8న ప్రారంభించారు.
ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన నోట్‌ కూడా దీనినే ధృవీకరిస్తోంది. ఆ నోట్‌ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2022 నవంబర్‌ 3న ఇన్‌స్టిట్యూట్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు. అంతేకానీ ఐజ్వాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కాదు. 2011 నుండి యూనివర్సిటీ ప్రాంగణంలో ఇన్‌స్టిట్యూట్‌ పని చేస్తోంది. దీనిని బట్టి బీజేపీ పాలనలోనే మిజోరంలో ఆల్‌ ఇండియా మాస్‌ కమ్యూనికేషన్‌ వంటి సంస్థలు ప్రారంభమయ్యాయంటూ మోడీ చేస్తున్న వాదన శుద్ధ అబద్ధమని తేలిపోయింది.
గౌహతి ఎయిమ్స్‌లో సిబ్బంది కొరత
తన హయాంలోనే ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి ఎయిమ్స్‌ ప్రారంభమైందని మోడీ చేస్తున్న వాదన మాత్రం నిజమే. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద 2017 మే 26న గౌహతిలో ఎయిమ్స్‌ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సంవత్సరం ఆగస్ట్‌ 1వ తేదీన రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ సమాధానమిస్తూ గౌహతిలో ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 91% పూర్తయ్యాయని తెలిపారు. 2020-21 నుండి తాత్కాలిక భవనంలో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు 2022 మార్చి 15న రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ గౌహతి ఎయిమ్స్‌కు 183 మంది బోధనా సిబ్బంది పోస్టులు మంజూరు కాగా 21 పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు 40 మంజూరు కాగా ఏడు భర్తీ అయ్యాయని, 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు మంజూరైతే ఒకే ఒక్కటి భర్తీ అయిందని, 1018 బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఏడు మాత్రమే భర్తీ అయ్యాయని వివరించారు. గౌహతి ఎయిమ్స్‌ సంస్థ సిబ్బంది కొరతతో సతమతమవుతుంటే ప్రధాని మాత్రం ఆ సంస్థ ఏర్పాటే ఓ ఘనకార్యమని చెప్పుకోవడం విడ్డూరమే.
స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోనే యూనివర్సిటీ
బీజేపీ పాలనలో మణిపూర్‌లో క్రీడా యూనివర్సిటీ ప్రారంభమైందని మోడీ గొప్పగా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది నిజమే. జాతీయ క్రీడా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇంఫాల్‌లో విశ్వవిద్యాలయ నిర్మాణానికి 2018 మార్చి 16న ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం ఖుమన్‌ లంపక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నడుస్తోంది. ప్రస్తుతం యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
రచయిత, సంపాదకులపై మణిపూర్‌లో కేసు
ఇంఫాల్‌ : 2018లో ప్రచురించబడిన ఓ పుస్తకం రాష్ట్ర చరిత్రను వక్రీకరిస్తోందంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు మణిపూర్‌ పోలీసులు ఒక రచయిత, ఇద్దరు సంపాదకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రిటైర్డ్‌ కల్నల్‌ డాక్టర్‌ విజరు చెంజీ ఈ పుస్తకాన్ని రాశారు. దీనిని జేఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జాంగ్‌ఖోమాంగ్‌ గూటే, థాంకోలాల్‌ హాకిప్‌ సవరించారు. చెంజీపై ఈ నెల 9న, మిగిలిన ఇద్దరిపై ఈ నెల 7న ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ పుస్తకంలో 1917-1919 కాలంలో జరిగిన కుకీ తిరుగుబాటును ఆంగ్లో-కుకీ యుద్ధంగా చిత్రించారని, తద్వారా తప్పుడు కథనాన్ని సృష్టించి శాంతికి విఘాతం కలిగించారని ఫిర్యాదులో ఆరోపించారు.
బ్రిటన్‌ దళాలకు, కుకీలకు మధ్య ఎన్నడూ యుద్ధమే జరగలేదని ఫిర్యాదుదారులు తెలిపారు. కుకీ తిరుగుబాటు కారణంగా కొండ ప్రాంతంలో నాగాలు ఊచకోతకు గురయ్యారని, లోయలో మైతీలు, ముస్లింలను చంపేశారని వారు వివరించారు. దీంతో వివిధ సెక్షన్ల కింద పుస్తక రచయిత పైన, సంపాదకుల పైన ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

Spread the love