– యోగి ప్రకటన ఆ ఎత్తుగడలో భాగమే
– అందులో భాగమే మత ఘర్షణలు
– మౌనంలోనే మోడీ..
– ఏ అవకాశాన్నీ వదులుకోని బీజేపీ నేతలు
– హర్యానాలో చెలరేగిన హింస దానికి తాజా ఉదాహరణే
హర్యానాలో చెలరేగిన మతపరమైన ఘర్షణలు ఓట్ల రాజకీయంలో భాగమేనని చెప్పాలి. గురుగ్రామ్‌లోని ఓ మసీదును తగలబెట్టి 19 సంవత్సరాల ఇమామ్‌ను దారుణంగా చంపేశారు. మాంసం దుకాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. నూహ జిల్లాలో వీహెచ్‌పీ చేపట్టిన బల ప్రదర్శన హింసకు దారి తీసింది. ఆరుగురి ప్రాణాలు తీసింది. మరెందరినో గాయపరిచింది. వాస్తవం ఇలా ఉంటే వీహెచ్‌పీ ప్రదర్శనపై దుండగులు దాడి చేశారని, దీనివల్లే ఘర్షణలు చెలరేగాయని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. నిజానికిసంఫ్‌ు పరివార్ పథకంలో భాగంగానే నూహ, గురుగ్రామ్‌లో హింస చెలరేగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో గతంలోనూ, ఇప్పుడు హర్యానాలోనూ ఎక్కడ మత ఘర్షణలు జరిగినా అవి ఎన్నికల నేపథ్యంలో జరగటం గమనార్హం.
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయం కోసం బీజేపీ, సంఫ్ పరివార్ సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునేందుకు అడ ్డదారులు వెతుకుతున్నాయి. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటనను ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది. ముస్లింలు గతంలో చేసిన చారిత్రక తప్పిదాలను గుర్తించి, అవస రమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయన సుద్దులు చెప్పారు. ఆదిత్యనాథ్ ప్రకటన బీజేపీ ఊహించినట్లుగానే రాజకీయ వివాదానికి తెర లేపింది. ఆదిత్యనాథ్ ప్రకటన రాజకీయ ఎత్తుగడేనని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. తన ప్రకటనను మైనారిటీలు ఎలాగూ వ్యతిరేకిస్తారని ఆయనకు తెలుసు. అయితే మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకే ఆదిత్యనాథ్ ఈ పాచిక వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. జ్ఞానవాపి మసీదుపై నెలకొన్న వివాదానికి సంబంధించిన వేర్వేరు కేసులలో అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వనున్న కీలక తరుణంలో ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు. తీర్పులు వెలువడనున్న సమయంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి చేసిన ప్రకటన కచ్చితంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాక న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేసిన హిందూ సంస్థల అభ్యర్థనలను ఈ ప్రకటన సమర్ధించింది.
కేసుల మీద కేసులు…
ఇక వారణాసిలోని ఓ మసీదుపై కూడా వివాదం నడుస్తోంది. పైగా అది ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం లోనిది. బీజేపీ, సంఫ్‌ు పరివార్ అనుబంధ సంస్థల ప్రోత్సాహంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వివాదాన్ని గత మూడు సంవత్సరాలుగా రగిలిస్తూనే ఉన్నాయి. న్యాయ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసేందుకు సంఫ్‌ు పరివార్ అనుబంధ సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు వాటికి వంత పాడుతున్నారు. కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా నది కారిడార్ నిర్మాణ పరిసరాలలోని అనేక కట్టడాలను ఇప్పటికే కూల్చేశారు. 2019 డిసెంబర్‌లో అయోధ్య వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ శక్తులకు మరింత ప్రేరణ ఇచ్చింది. హిందూ దేవాలయాలను కూల్చివేసి, ఆ స్థానంలో మసీదులు నిర్మించారంటూ వాదనలను తెర పైకి తెచ్చి న్యాయస్థానాలలో అనేక వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ మసీదులను కూలదోసి, తిరిగి దేవాలయాలను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓట్ల కోసం పాట్లు
ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 2021 డిసెంబర్‌లో ప్రధాని మోడీ కాశీ విశ్వనాథ దేవాలయ కారిడార్‌ను ప్రారంభించారు. ఫలితంగా 2022 మార్చిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. 2017 ఎన్నికల సమయంలో కూడా మోడీ ప్రజలలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీకి ఓట్ల వర్షం కురిపించారు. బీజేపీ నాయకులు కూడా మోడీనే అనుసరిస్తూ తమ వంతు పాత్ర పోషించారు. కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ గత నెలలో 80 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. హిందువులకు పవిత్ర మాసంగా భావించే జూలై నెలలో ఆయన గ్రామాలు, పట్టణాలు, నగరాలలో కాలినడకను చుట్టి వచ్చి, ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద అంశాలను ప్రస్తావించి, హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. గత నెల 30న జరిగిన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో కూడా మోడీ సంస్కృతి, మతం వంటి విషయాలను ప్రస్తావించారు. ‘బనారస్ చేరుకునే యాత్రికుల సంఖ్య రికార్డు సృష్టించింది. ఇప్పుడు ప్రతి ఏటా పది కోట్ల మంది కాశీ వస్తున్నారు. అయోధ్య, మధుర, ఉజ్జయినికి వెళ్లే సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనివల్ల పేదలకు ఉపాధి లభిస్తోంది’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఎక్కడ అవకాశం వచ్చినా మోడీ మతాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. అందువల్ల దేశంలో తలెత్తుతున్న మత ఘర్షణలన్నీ యాధృశ్చికం అనుకోలేం. ఇప్పుడు హర్యానా ఘటనలు సైతం అందుకు మినహాయింపు కాదు.