వితండ వాదం.

వ్యక్తిగత చట్టాలను సవరిస్తే సరిపోతుందంటున్న నిపుణులు
– లింగ సమానత్వానికే యూసీసీ : బీజేపీ
ఎవరెన్ని అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ముందుకే వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ‘ఒకే దేశం…ఒకే రాజ్యాంగం’ అని ప్రవచిస్తున్న ఆ పార్టీ లింగ సమానత్వం సాధించాలంటే యూసీసీ అవసరమని వితండవాదం చేస్తోంది. తద్వారా ఈ రెండింటికీ లంకె పెట్టాలని చూస్తోంది. మహిళలపై కొనసాగుతున్న వివక్షను అంతం చేయాలంటే దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న వ్యక్తిగత చట్టాలను (పర్సనల్‌ లా) సవరించాలని 21వ లా కమిషన్‌ నివేదిక సూచించింది. అయితే 22వ లా కమిషన్‌ గత నెలలో ఇచ్చిన నివేదికలో తాజా అంశాలను చేర్చింది.
న్యూఢిల్లీ : భోపాల్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ యూసీసీ అంశాన్ని లేవనెత్తి ఈ తేనెతుట్టెను కదిల్చారు. ఎన్నికలలో లబ్ది పొందేందుకు వీలుగా హిందూ శక్తులను ఏకం చేయడానికి యూసీసీని తెర పైకి తెస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే బీజేపీ 1996లో తన ఎన్నికల ప్రణాళికలోనే లింగ సమానత్వం సాధించాలంటే యూసీసీ అవసరమని అభిప్రాయపడింది. యూసీసీ అంటే లింగ సమానత్వమే అని బీజేపీ జాతీయ ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ చెబుతున్నారు. కులాలు, మతాలు, జాతులకు అతీతంగా మహిళలందరికీ సమాన హక్కులు ఉండాలని ఆయన తెలిపారు. ‘దేశంలోని అన్ని మతాల బాలికలకు వివాహ వయసు 18 సంవత్సరాలు కాకుండా 15 సంవత్సరాలు ఎందుకు ఉండాలి? దేశంలోని మహిళలందరికీ దత్తత చట్టాలు ఒకేలా ఎందుకు ఉండకూడదు? బహుభార్యత్వంతో మహిళలు ఎందుకు బాధపడాలి? ఇవన్నీ ఆందోళన కలిగించే విషయాలు’ అని ఆయన వివరించారు. ఆ విధంగా ఆయన లింగ సమానత్వానికి, యూసీసీకి ముడిపెట్టారు.
బీజేపీ ఏం చెబుతోంది?
బీజేపీ ఎన్నికల ప్రణాళికలను పరిశీలిస్తే 1996 ప్రణాళికలో ‘మహిళా శక్తి : సాధికారత దిశగా’ అనే శీర్షిక కింద యూసీసీ ప్రస్తావన ఉంది. 1998 ప్రణాళికలో ‘మహిళా శక్తి : మహిళల సాధికారత’ అనే శీర్షిక కింద మరోసారి యూసీసీ ప్రస్తావన తెచ్చారు. 2004 ప్రణాళికలో ‘మా కర్తవ్యం-కట్టుబాట్లు’ అనే శీర్షిక కింద యూసీసీపై ఏకాభిప్రాయం సాధిస్తామని తెలిపారు. లింగ సమానత్వం కోసం యూసీసీని తీసుకొస్తామని, తిరోగమన వ్యక్తిగత చట్టాల రాజ్యాంగ బద్ధతకు చెల్లుచీటీ ఇస్తామని ప్రకటించారు. యూసీసీని రూపొందించేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని 2009 ప్రణాళికలో తెలిపారు. 2014 ప్రణాళికలో ,2019 ఎన్నికల ప్రణాళికలో కూడా ఇవే పదాలను చేర్చారు.
వ్యక్తిగత చట్టాలను సంస్కరిస్తే చాలు
లింగ సమానత్వం కోసం చట్టపరమైన సంస్కరణలు తేవాలంటే యూసీసీ అవసరమే లేదని న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. లింగ సమానత్వం కోసం నిబంధనలు రూపొందించడానికి వ్యక్తిగత చట్టాలను సంస్కరించాలంటూ 21వ లా కమిషన్‌ చేసిన సూచన అనుసరణీయమని మహిళా హక్కుల న్యాయవాది ఫ్లావియా ఆగేశ్‌ చెప్పారు. వ్యక్తిగత చట్టాలన్నింటిలోనూ మహిళలపై ఉన్న వివక్షను పరిశీలించి, ఆ చట్టాలను సవరిం చాలని లా కమిషన్‌ సూచిందని తెలిపారు. కాబట్టి మైనారిటీల విషయంలో వివక్షతో కూడిన యూసీసీకి బదులు చట్టాలను సవరించడమే మంచిదని తాను భావిస్తున్నానని చెప్పారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా లా కమిషన్‌ చేసిన సిఫారసులను ప్రభుత్వం అమలు చేయడం లేదు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ చర్యగా యూసీసీని ముందుకు తెచ్చింది’ అని వివరించారు.
యూసీసీ లేకుండానే లింగ సమానత్వాన్ని సాధించవచ్చునని బెంగళూరుకు చెందిన న్యాయ శాస్త్ర ప్రొఫెసర్‌ సరసు ఎస్తేర్‌ థామస్‌ స్పష్టం చేశారు. లింగ సమానత్వాన్ని సమర్ధించే చట్టాలను రూపొందించడం చాలా సులభమని, అన్ని చట్టాలను మార్చడం ఆచరణ సాధ్యం కాదని ఆమె తెలిపారు. ఇందుకు ఉదాహరణగా ఆమె గృహహింస చట్టాన్ని ప్రస్తావించారు. వివిధ మతాల వారికి వ్యక్తిగత చట్టాలు ఉన్నప్పటికీ మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుందని అన్నారు. చట్టాలలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. హిందువుల కోసం ఉద్దేశించిన వేర్వేరు చట్టాలలోనే లింగ సమానత్వం లేదని ఆమె గుర్తు చేశారు. ‘హిందూ వారసత్వ చట్టాన్నే తీసుకోండి. ఒక వ్యక్తి చనిపోయాడనుకోండి. అతని భార్య అంతకుముందే చనిపోతే, వారికి పిల్లలు ఎవరూ లేకపోతే అతని కుటుంబానికి ఆ ఆస్తి చెందుతుంది. కానీ ఓ మహిళ చనిపోతే, భర్త అంతకుముందే చనిపోతే, వారికి పిల్లలు లేకుంటే, ఆమె ఆస్తి ఆమె కుటుంబానికి చెందదు. భర్త బంధువులకు వెళుతుంది. కాబట్టి ఈ చట్టాలేవీ యూసీసీకి ప్రాతిపదిక కాజాలవు. హిందూ వివాహ చట్టం ఉన్నప్పటికీ అది ఒకేలా లేదు. అందు లో లింగ సమానత్వమూ లేదు’ అని వివరించారు.
లింగ సమానత్వం కోసమే యూసీసీని తెస్తే క్రోడీకరించిన వ్యక్తిగత చట్టాలు లేక ముస్లిం మహిళలు నష్టపోతారని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ అనే హక్కుల బృందం వ్యవస్థాపక సభ్యురాలు జకియా సోమన్‌ అన్నారు. క్రోడీకరించిన ముస్లిం చట్టాల కోసం తాము 20 సంవత్సరాల నుండీ డిమాండ్‌ చేస్తున్నామని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం చట్టాలలో సంస్కరణలు లేవని, అందువల్ల హిందూ క్రైస్తవ మహిళలకు ఉన్న హక్కులు ముస్లిం మహిళలకు ఉండవని చెప్పారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల సంసిద్ధత
మధ్యప్రదేశ్‌, అస్సాం, ఉత్తరప్రదేశ్‌, హర్యానా సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు యూసీసీ అమలుకు సిద్ధపడ్డాయి. యూసీసీ ముసాయిదా సిద్ధంగా ఉన్నదని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం యూసీసీ అమలులో ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. యూసీసీని వ్యతిరేకించే వారు లింగ సమానత్వాన్ని, మహిళా సాధికారతను కోరుకోవడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ విమర్శించారు. అయితే క్రోడీకరించిన హిందూ చట్టం గోవాలో లేదని న్యాయవాది ఆగేశ్‌ చెప్పారు. అందరికీ వర్తించేలా ఒకే చట్టాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నించే ముందు లింగ వివక్షను అంతం చేయాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు.
తొందరపాటు తగదు యూసీసీపై అమర్త్యసేన్‌
వెయ్యి సంవత్సరాలు జీవిస్తాం. యూసీసీని ఎలా ప్రవేశపెడతారు? ఎందుకు ప్రవేశపెడతారు? దీని అమలుతో ఎవరు ప్రయోజనం పొందుతారు? అభివృద్థి పథంలో ఇది ఒక పెద్ద తప్పిదమని మనం గుర్తించాలి’ అని ఆయన అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎందుకు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని చెప్పారు. ఒకే దేశంగా ఉన్నంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావని అమర్త్యసేన్‌ తెలిపారు

Spread the love