ఇథనాల్‌ ఉత్పత్తికి పేదల బియ్యం

– మోడీ నిర్ణయంతో రాష్ట్రాలకు కష్టాలు
తన వద్ద ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోతున్నప్పటికీ వాటిని పేదలకు సరఫరా చేసేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రాలకు విక్రయించే బియ్యం, గోధుమలపై ఇప్పటికే కేంద్రం నిషేధం విధించింది. అయితే ఆ నిల్వలను ఇంధన తయారీలో వాడే ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్లించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఇంధన ఉత్పత్తికి దారి మళ్లిస్తోంది.
న్యూఢిల్లీ : ఇథనాల్‌ ఉత్పత్తిలో బియ్యాన్ని ముడి పదార్థంగా వాడడం సరైన చర్య కాదని, ముఖ్యంగా ఆహార అవసరాల కోసం బియ్యం కొనకుండా రాష్ట్రాలను అడ్డుకోవడం సమర్ధనీయమూ కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బహిరంగ మార్కెట్‌లో అమ్మకం పథకం (ఓఎంఎస్‌ఎస్‌) కింద రాష్ట్రాలకు బియ్యం, గోధుమలను విక్రయించవద్దంటూ కేంద్రం ఈ నెల 13న ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఇథనాల్‌ ఉత్పత్తి కోసం మాత్రం రాష్ట్రాలకు బియ్యాన్ని కేటాయించవచ్చునంటూ ఎఫ్‌సీఐకి వెసులుబాటు ఇచ్చింది. 2013వ సంవత్సరపు ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలోని 81.3 కోట్ల మంది లబ్దిదారుల కోసం ఆరు కోట్ల టన్నుల బియ్యం, గోధుమలను కేంద్రం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా బియ్యం, గోధుమలను సేకరించి, నిల్వ చేసి, పంపిణీ చేస్తూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్‌, సంక్షేమ పథకాల కోసం అవసరమైన దాని కంటే ప్రభుత్వం ఎక్కువగానే ఆహార ధాన్యాలను సేకరిస్తోంది. ఈ సంవత్సరం జూన్‌ 1వ తేదీ నాటికి కేంద్రం వద్ద 41.4 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 31.4 టన్నుల గోధుమల నిల్వ ఉంది.
ఓఎంఎస్‌ఎస్‌ ఎందుకు?
ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ఓఎంఎస్‌ఎస్‌ ఉద్దేశం. కేంద్రం వద్ద నిల్వ ఉన్న అదనపు ఆహార ధాన్యాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎఫ్‌సీఐ విక్రయించవచ్చు. నిబంధనల కంటే కేంద్రం వద్ద ఎక్కువ నిల్వలు ఉన్నప్పుడు వాటిని తగ్గించుకునేందుకు ఓఎంఎస్‌ఎస్‌ను అమలు చేస్తారు.
ఇలాంటి పరిస్థితులలో కేంద్రం సాధారణంగా రాష్ట్రాలకు అదనపు నిల్వల విక్రయాన్ని స్వాగతిస్తుంది. ఎందుకంటే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద తనకు కేటాయించిన ఆహార ధాన్యాలకు చెల్లించిన ధర కంటే ఓఎంఎస్‌ఎస్‌ కింద చెల్లించే ధరే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఈ సంవత్సరం మే 24 నుండి రాష్ట్ర ప్రభుత్వాలు ఓఎంఎస్‌ఎస్‌ కింద క్వింటాలుకు రూ.3,400 చొప్పున 1.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు కొనుగోలు చేశాయి. ఇందులో ఒక్క కర్నాటక రాష్ట్రమే 1.12 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకుంది.
దిగుమతులను తగ్గించేందుకే : కేంద్రం
భారత ఇంధన అవసరాలలో 86% దిగుమతుల పైనే ఆధారపడి ఉన్నాయి. దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు ఇథనాల్‌ ఉత్పత్తి, వినియోగంపైన ప్రభుత్వం దృష్టి సారించింది. దేశీయంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలంటే చెరకు, మొక్కజొన్న, బియ్యం ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఎఫ్‌సీఐ విక్రయించే బియ్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే దిస్టిలరీలకు బియ్యమే ప్రధాన వనరు. ఇథనాల్‌కు క్వింటాలుకు రూ.2,000 ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. ఓఎంఎస్‌ఎస్‌ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయించిన రూ.3,400 కంటే ఇది చాలా తక్కువ. నీతి ఆయోగ్‌ కింద నిపుణుల కమిటీ రూపొందించిన డాక్యుమెంట్‌ ఆధారంగానే ఇథనాల్‌ ఉత్పత్తి కోసం బియ్యం కేటాయించాలన్న విధానాన్ని రూపొందించారు.
కేంద్రం వద్ద ప్రతి ఏటా 30.9 మిలియన్‌ టన్నుల బియ్యం అదనంగా నిల్వ ఉంటోందని నీతి ఆయోగ్‌ డాక్యుమెంట్‌ తెలిపింది. 2020-21లో 1.06 మెట్రిక్‌ టన్నులు, ఈ సంవత్సరం 1.5 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తి కోసం కేంద్రం కేటాయించింది.

Spread the love